8 July, 2026 | 2:01 AM

రెండు నెలల తర్వాత బస్తాలు తగ్గాయా?

08-07-2026 12:00 AM

మొక్కజొన్న రైతుల బిల్లులు నిలిపివేతపై ఆందోళన

అలంపూర్, జూలై 7: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు మొక్కజొన్న విక్రయించిన రైతులకు రెండు నెలలు గడిచినా పూర్తి బిల్లులు చెల్లించకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. కొనుగోలు సమయంలో ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయని అధికారులు, ఇప్పుడు గోదాముల్లో బస్తాల వ్యత్యాసం ఉందని చెబుతూ బిల్లులు నిలిపివేయడంపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

వడ్డేపల్లి మండలం కొంకల గ్రామానికి చెందిన రైతు మల్లెందొడ్డి కోటేశ్వర గౌడ్ గ్రామ రైతులతో కలిసి మొత్తం 624 బస్తాల మొక్కజొన్నను ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి విక్రయించారు. అయితే ఇటీవల సొసైటీ సిబ్బంది ఫోన్ చేసి, ఆయన సరుకులో 9 బస్తాలు తక్కువగా ఉన్నాయని, ఆ వ్యత్యాసాన్ని అంగీకరిస్తేనే బిల్లు విడుదల చేస్తామని తెలిపినట్లు రైతు ఆరోపించారు.కొనుగోలు కేంద్రంలోనే అధికారులు, సిబ్బంది, లారీ డ్రైవర్ సమక్షంలో బస్తాలు లెక్కించి లోడ్ చేశారని, రెండు నెలల తర్వాత బస్తాలు తగ్గాయని చెప్పడం అన్యాయమని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

వెంటనే తమ బిల్లులు విడుదల చేసి న్యాయం చేయాలని కోరారు. ఈ విషయంపై సొసైటీ సీఈఓ రవి స్పందిస్తూ, ఆదోని గోదాముతో పాటు ఇతర గోదాములకు పంపిన లారీల్లో కలిపి 30కి పైగా బస్తాల వ్యత్యాసం నమోదైన విషయం వాస్తవమేనని తెలిపారు. అయితే అన్ని లోడ్ల వివరాలను మరోసారి సమగ్రంగా పరిశీలించి, సమస్యకు పరిష్కారం చూపడంతో పాటు రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.