calender_icon.png 7 February, 2026 | 12:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతర్రాష్ట్ర బదిలీలపై ఆందోళన

07-02-2026 01:10:55 AM

తాజాగా ఏపీ ప్రభుత్వ ఆదేశాల జారీతో తెర మీదకు చర్చ 

పదోన్నతులకు ముప్పే అంటున్న తెలంగాణ ఉద్యోగులు

హైదరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి) : అంతర్రాష్ట్ర ఉద్యోగ బదిలీల అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న తాజా చర్యలు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణకు బదిలీ కావాలని గతంలో ఆప్షన్ ఇచ్చిన ఉద్యోగుల వివరాలను నవీకరించాలని ఏపీ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేయడం ఈ చర్చకు దారితీసింది.

ఫిబ్రవరి 9లోపు తెలంగాణకు బదిలీ కోరుతూ ఆప్షన్ ఇచ్చిన ఉద్యోగుల సమగ్ర వివరాలను అప్‌డేట్ చేసి, వాటిని తెలంగాణ ప్రభుత్వానికి పంపించాలని ఏపీ ప్రభుత్వం అక్కడి శాఖలకు సూచించింది. ఈ డేటాను తెలంగాణ ప్రభుత్వం పరిశీలించి విధానపరమైన నిర్ణ యం తీసుకునేందుకు పంపిస్తున్నట్లు ఆ నోటులో పేర్కొంది.

అయితే, తెలంగాణ ప్రభుత్వవర్గాల ప్రకారం, ఉద్యోగుల బదిలీలు అదే సేవలో, అదే కేటగిరీ పోస్టులకు మాత్రమే జరగాలి. అలాగే, ఇప్పటికే తెలంగాణలో పనిచేస్తున్న ఉద్యోగుల పదోన్నతి అవకాశాలు, సేవా ప్రయోజనాలు ఏ మా త్రం దెబ్బతినకూడదన్నది ప్రభుత్వం నుంచి స్పష్టమైన అభిప్రాయం ఉంది.

పోస్టుల లభ్యత కూడా కీలక అంశమని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ఏపీ ప్రభు త్వం ప్రతిపాదిస్తున్న ఉద్యోగుల ‘ఎక్స్చేంజ్’ విధానం వేర్వేరు శాఖలు, వేర్వేరు సేవల మధ్య బదిలీలకు దారి తీస్తుందని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇలా జరిగితే సేవా నిబంధనల్లో అనేక సమస్యలు తలెత్తడంతో పాటు న్యాయపరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

ఎక్సేంజ్ ప్రతిపాదనకు తిరస్కరణ..

గతంలో కూడా ఏపీ ప్రభుత్వం ఇలాంటి ప్రతిపాదనను తెచ్చినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం దానిని తిరస్కరించింది. అప్పట్లో ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ కావాల్సిన 1,241 మంది ఉద్యోగుల్లో పలువురు అడిషనల్ కమిషనర్(కమర్షియల్ టాక్సెస్), అడిషనల్ ఐజీ (రిజిస్ట్రేషన్), జాయింట్ కమిషనర్(ఎక్సైజ్), స్పెషల్‌గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, కమాండెంట్ వంటి ఉన్నత స్థాయి పోస్టుల్లో ఉన్నట్లు గుర్తించారు.

ఈ ప్రతిపాదన అమలైతే తెలంగాణ ఉద్యోగుల పదోన్నతే కాకుం డా, స్థానికులకు ఉద్యోగ నియామకాల అవకాశాలపై తీవ్రప్రభావం పడుతుందని అధి కారులు పేర్కొన్నారు. అందుకే గతంలో 1,808 మంది ఏపీ ఉద్యోగులను తెలంగాణకు, 1,368 మందిని ఏపీకి బదిలీ చేసే ఎక్స్చేంజ్ ప్రతిపాదనను తెలంగాణ ప్రభు త్వం పూర్తిగా పక్కన పెట్టింది. 

ఇది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉద్దేశానికి విరుద్ధమని ప్రభుత్వం అభిప్రాయపడింది. రాష్ట్ర విభజన తర్వాత కమలా నాథన్ కమిటీ కేటాయింపుల అనంతరం ఖాళీగా ఉన్న సమాన కేడర్ పోస్టులను ఉపయోగించుకొని, 42 శాతం విభజన నిష్ప త్తిని మించికూడా తెలంగాణ ప్రభుత్వం స్థానిక ఉద్యోగులను తిరిగి తీసుకోవడం గమనార్హం. 2020 నుంచి 2022 మధ్యకాలంలో లాస్ట్ గ్రేడ్ సర్వీసుల్లో 70 శాతం మందికి పైగా ఉద్యోగులను తెలంగాణకు రప్పించింది. తాజా పరిణామాలతో అంతర్రాష్ట్ర బదిలీల అంశం మళ్లీ రాజకీయ, పరిపాలనావర్గాల్లో చర్చకు దారితీస్తోంది.