calender_icon.png 24 February, 2026 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇదేనా ప్రజాపాలన ప్రభుత్వం?

24-02-2026 12:21:49 AM

ఆశాల అక్రమ అరెస్టుల ఖండన

అరెస్టు చేసిన వారిని భేషరత్‌గా విడుదల చేయాలి 

సీఐటీయూ జిల్లా నాయకులు మద్దాల ప్రభాకరరావు

ఎర్రుపాలెం, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో చర్చించి అధిక నిధులు కేటాయించి అమలు చేయాలని డిమాండ్ల పరిష్కారం కోసం ఫీబ్రవరి 24న జరిగే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఆశాలు బయలుదేరి హైదరాబాద్ లోని కోఠీ కమిషనర్ కార్యాలయ ముట్టడికి వెళ్తుంటే ప్రభుత్వం తీవ్ర నిర్బంధకాండను ప్రయోగించి ముందస్తుగానే ఆశాలను  అరెస్టు చేయడo ఇదేనా ప్రజా పాలన ప్రభుత్వ మని  సిఐటియు జిల్లా నాయకులు మద్దాల ప్రభాకరరావు* ప్రశ్నించారు.

ఈ సందర్భంగా ప్రభాకరరావు మాట్లాడుతూ ఎక్కడికి అక్కడ ఇంటి వద్ద,ఆటోలు,బస్సులు ఆపి బూతద్దంలో పెట్టి తనిఖీ చేసి ఆశ కార్యకర్తలను దొంగలను పట్టుకున్నట్టు పట్టుకొని మహిళలు అనేది కూడా చూడకుండా అరెస్టులు చేయడం పోలీస్ స్టేషన్ లలో ఖైదీలను నిర్బంధించినట్లు  నిర్బంధించటం ఇది ఎంతవరకు సమంజసం అని ఆవేదన వెళ్ళబుచ్చారు.పోలీస్ నిర్బంధాలను చేధించి వేల మంది ఆశాలు హైద్రాబాద్ కోఠీ డైరెక్టర్ ఆఫీస్ ప్రధాన గేట్ వద్ద బైఠాయించార ని వందలాది మంది పోలీసులు అడ్డుకొని అక్రమ అరెస్టులు చేశారన్నారు.

మహిళలని కూడా చూడకుండా మగ పోలీసులు ఆశాలను కొట్టి, గాయపరచి బలవంతంగా వ్యానుల లో కుక్కారని ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు.ఈ సందర్భంగా అనేక మంది ఆశా వర్కర్ లు స్పృహ కోల్పోయి పడిపోయారని అయినా పోలీసులు కనికరించలేదని విమర్శించారు. అనేకమంది కాళ్ళు, చేతులకు గాయాలయ్యాయని ఆందోళన చెందారు. తమ హక్కుల కోసం పోరాటం చేసే స్వేచ్ఛ  కాంగ్రెస్ ప్రభుత్వం లో లేదా అని ప్రశ్నించారు.

అమానుషంగా,కర్కశంగా ప్రవర్తించి సుదూర ప్రాంతాల నుంచి హైద్రాబాద్ వెళ్లిన వారిని రాత్రి వరకు పోలీస్ స్టేషన్ నుంచి బయటికి పంపకుండా నిర్బంధిస్తున్నారు. మహిళలు రాత్రిపూట వారి గమ్యానికి ఎట్లా చేరుకోవాలో ఈ ప్రభుత్వం చెప్పాలని మండిపడ్డారు. అరెస్టైన వారిని బేషరతుగా వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆశాల పోరాటంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధకాండకు, అక్రమ అరెస్టులకు నిరసనగా ఎర్రుపాలెం మండల కేంద్రoలో మంగళవారం నిరసన కార్యక్రమo ఉంటుందని అన్ని ఉద్యోగ సంఘాలు పాల్గొని ఆశా కార్యకర్తలకు మద్దతు తెలపాలని  పిలుపునిచ్చారు.