27 April, 2026 | 5:39 AM

క్షయ వ్యాధిపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమం నిర్వహణ

09-12-2024 07:23 PM

ఇల్లెందు (విజయక్రాంతి): దేశంలో క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంలో నిర్వహిస్తున్న 100 రోజుల ముమ్మర కృషి కార్యక్రమం నిక్షయ్ షివిర్ లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధీలో టేకులపల్లి మండలం సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ కందుల దినేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ బొమ్మనపల్లి ఆరోగ్య ఉప కేంద్రం పరిధిలోని బిల్లుడు తండా, జెండాల తండా, రామకృష్ణాపురం, కొత్త తండా గ్రామాల ప్రజలకు క్షయ వ్యాధిపై అవగాహన, అనుమానితుల గుర్తింపు, శాంపిల్ సేకరణ కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన క్షయ వ్యాధి తీవ్రంగా ఉన్న 347 జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది జిల్లాలు ఉన్నాయని అందులో మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒకటని కాబట్టి క్షయ వ్యాధిపై సమాజంలోని ప్రతి ఒక్కరూ చర్చించుకుని అవగాహన పెంచుకొని దానిని పూర్తిగా నిర్మూలించడంలో సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. లేనిచో క్షయ వ్యాధి బారిన పడి మరణం పొందిన జాబితాలో మనతో పాటు మన కుటుంబ సభ్యులు కూడా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తూ వ్యాధి లక్షణాలు అయినా 15 రోజులకు మించి దగ్గు జ్వరం ఆకలి లేకపోవడం బరువు తగ్గిపోవడం వంటి ప్రధాన లక్షణాలు ఉన్నవారు గతంలో క్షయ వ్యాధికి మందుల వాడిన వారు, వారి కుటుంబ సభ్యులు దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడుతున్న వారు ఈ వందరోజుల నిక్షయ్ షివిర్ కార్యక్రమంలో పాల్గొని ఉచిత క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుని నిర్ధారణ జరిగితే ప్రభుత్వం ఇచ్చే నాణ్యమైన మందులతో వ్యాధిని తగ్గించుకొని తద్వారా మరణాన్ని నివారించుకోవడంతో పాటు కుటుంబ సభ్యులకు, సమాజంలోని ఇతరులకు క్షయ వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చని తద్వారా ఈ వ్యాప్తిని భారత సమాజం నుంచి పూర్తిగా నిర్మూలించడం సాధ్యపడుతుందని అన్నారు.

అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో క్షయ వ్యాధికి మందులు వాడే ప్రతి వ్యాధిగ్రస్తుడికి వ్యాధి తగ్గే వరకు నిరంతర సూచనలు సలహాలు ఇవ్వడంతో పాటు పోషకాహార నిమిత్తం మందులు వాడే కాలానికి ప్రతి నెల 1000 రూపాయలు ఎకౌంట్ లో వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వజ్జా పార్వతి, పబ్లిక్ హెల్త్ నర్స్ చంద్రకళ, ఇల్లందు డివిజన్ క్షయ వ్యాధి నివారణ అధికారి శంకర్, సూపర్వైజర్ నాగుబండి వెంకటేశ్వర్లు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ హారిక, పంచాయతీ కార్యదర్శి నరేష్ నాయక్, వైద్య సిబ్బంది కమల, సుజాత, ఉపాధ్యాయులు రమేష్, లోక్యా, అంగన్వాడీ టీచర్లు అమ్మి, సరోజ, పూర్ణ, నీల, ఆశా కార్యకర్తలు భారతి వీరమ్మ, తార లక్ష్మి  పాల్గొన్నారు.