ఓటు బ్యాంకు రాజకీయాలకే అంబేద్కర్‌ను పరిమితం చేశారు
* అంబేద్కర్ ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేద్దాం
* బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు
ఖమ్మం, ఏప్రిల్ 13(విజయక్రాంతి): గత పాలకులు బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పేరును కేవలం తమ స్వార్థ రాజకీయాల కోసం, ఓటు బ్యాంకు కోణంలోనే వాడుకున్నారని భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు విమర్శించారు. సోమవారం ఖమ్మం నగరంలోని 58వ డివిజన్ రమణగుట్టలో మేకల నాగేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వారోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ముందు జ్యోతి ప్రజ్వలన చేసి, నివాళులర్పించిన అనంతరం ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే అంబేద్కర్‌కు సరైన గౌరవం దక్కిందని కోటేశ్వరరావు పేర్కొన్నారు. గతంలో అంబేద్కర్‌ను కేవలం కొన్ని వర్గాల నాయకుడిగానే చూపే ప్రయత్నం జరిగిందని, కానీ మోదీ ప్రభుత్వం ఆయనను దేశ రాజ్యాంగ సృష్టికర్తగా, అన్ని వర్గాల ప్రజల మహోన్నత వ్యక్తిగా ప్రపంచానికి చాటిచెప్పిందన్నారు. స్మృతి వనాల ఏర్పాటు, జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా అంగరంగ వైభవంగా నిర్వహించడం వంటి చర్యల ద్వారా ఆయన గౌరవాన్ని ఇనుమడింపజేసిందని కొనియాడారు.
అంబేద్కర్ వాస్తవ జీవిత చరిత్రను, ఆయన ఉన్నతమైన ఆలోచనలను భావి తరాలకు అందించడంలో బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని వివరించారు. ఓటు హక్కును కల్పించి, రాజ్యాంగబద్ధం చేయడం ద్వారా భారతీయులందరికీ తమ తలరాతను తామే రాసుకునే గొప్ప అవకాశాన్ని కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని ఆయన స్మరించుకున్నారు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
స్థానిక రమణగుట్ట ప్రాంతంలోని కమ్యూనిటీ హాల్ అభివృద్ధికి, మరిన్ని మౌలిక వసతుల కల్పనకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఖమ్మం నగర రెండో పట్టణ అధ్యక్షుడు ధన్యాకుల వెంకటనారాయణ, సీనియర్ నాయకులు మందడపు సుబ్బారావు, మేకల నాగేంద్ర, బోయల వెంకట్, నక్కల రవిగౌడ్, కందుల శ్రీకృష్ణ, రుద్ర గాని మాధవ్, బోయినపల్లి సురేష్, కందుల శ్రీకృష్ణ, నాగరాజు,భద్రం తదితరులు పాల్గొన్నారు.




