5 March, 2026 | 4:31 AM

గందరగోళంగా.. నల్లా పన్ను

05-03-2026 01:14 AM
  1. ఇంటి పన్ను రూ. 120.. నల్లా పన్ను రూ. 1200..!

కేసముద్రం మున్సిపాలిటీ గిందుకే చేశారా.?!

కనెక్షన్ లేకున్నా నల్లా పన్ను

కేసముద్రం, మార్చి 4 (విజయక్రాంతి): కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా నూతనంగా ఏర్పడిన కేసముద్రం మున్సిపాలిటీ పరిస్థితి మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసముద్రం స్టేషన్, కేసముద్రం విలేజ్, అమీనాపురం, ధనసరి, సబ్ స్టేషన్ తండా గ్రామాలను విలీనం చేసి గత ఏడాది కేసముద్రం మున్సిపాలిటీగా ఏర్పడడంతో తమకు పట్టణంగా మారి అనేక సౌకర్యాలు వసతులు వస్తాయనుకుంటే అందుకు భిన్నంగా ఇప్పుడు పరిస్థితి మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దు గ్రామాలను విలీనం చేసి కొత్తగా మున్సిపాలిటీగా ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు నల్లా పన్ను పేరుతో భారీగా ఛార్జీల వడ్డింపు జరిగిందని విమర్శిస్తున్నారు. ఐదు గ్రామాల్లో కలిపి చాలా ఇండ్లు రెండు నుంచి మూడు గదుల లోపే ఉన్నాయి. వాటికి గతంలో పంచాయతీగా ఉన్నప్పుడు కేవలం 100 నుంచి 120 రూపాయలు అంతకుమించి 200 లోపు ఇంటి పన్ను చెల్లించేవారు.

అందులోనే నీటి పన్ను, వీధిలైట్ల పన్ను, లైబ్రరీ సెస్ కలిపి ఉండేవని, ఇప్పుడు వాటికి తోడుగా వాటర్ ట్యాక్స్ పేరుతో నల్లా పన్ను నెలకు వంద రూపాయలు చొప్పున ఏడాదికి 1200 వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ పరిధిలోని దాదాపు 5 వేలకు పైగా ఉన్న గృహాలకు ఏడాదికి 1,200 చొప్పున మున్సిపాలిటీ అధికారులు వాటర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. 

నల్లా లేకున్నా.. వాటర్ టాక్స్

ఇందులో విచిత్రం ఏమిటంటే ఐదు గ్రామాల్లో గతంలో అనేక నిరుపేదల ఆవాసప్రాంతాలకు నల్ల కనెక్షన్లు లేవు. కేవలం పబ్లిక్ కుళాయిలు మాత్రమే ఏర్పాటు చేశారు. ప్రతిరోజు అక్కడనుండి పేదలు తమ ఇంటి అవసరాల కోసం, తాగునీటి కోసం నల్ల నీటిని పట్టుకొని వెళ్తున్నారు. మరి కొందరు ఆ పైప్ లైన్ కు సొంతంగా రబ్బర్ పైపు బిగించి ఇంటికి నీటిని తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఇంటికి నల్లా కనెక్షన్ లేకుండా 1,200 రూపాయలు వాటర్ టాక్స్ వడ్డిస్తున్నారు. తమ ఇంటి పన్ను 120 రూపాయలు ఉంటే వాటర్ టాక్స్ 1,200 వేస్తున్నారని పేదలు వాపోతున్నారు.

పట్టణంలో వాటర్ ట్యాక్స్ వసూళ్లకు ముందు ఇంటింటి సర్వే నిర్వహించి నల్లా కనెక్షన్ ఉన్న ఇంటికి మాత్రమే ట్యాక్స్ విధించాల్సి ఉండగా అందుకు భిన్నంగా ప్రతి ఇంటికి నల్లా లేకున్నా వాటర్ టాక్స్ వడ్డించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని గృహాలకు నల్లా కనెక్షన్ లేకున్నా వాటర్ టాక్స్ వేశారని, మరికొన్ని గృహాల్లో రెండు, మూడు కనెక్షన్లు ఉన్నా ఒక కనెక్షన్ ఉన్నట్లు నమోదు చేయడంతో నల్లా పన్ను వడ్డింపు గందరగోళంగా మారింది. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు స్పందించి ఇంటింటి సర్వే నిర్వహించి నల్లా కనెక్షన్ ఉన్న ఇండ్లకు మాత్రమే వాటర్ టాక్స్ విధించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

‘ఇంట్రా’లో లేకపోవడం వల్లే..!

గత ప్రభుత్వం ఇంటింటికి ఉచితంగా నల్ల కరెక్షన్ ఇచ్చి తాగునీటిని సరఫరా చేయడానికి మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుత కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని ఐదు గ్రామాల్లో అప్పట్లో కొన్ని చోట్ల మినహా అంతటా ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇచ్చారు. ఇంతకాలం మిషన్ భగీరథ కార్యక్రమంలో ప్రజలు సాధారణ నీటి పన్నుతో నల్లాల ద్వారా నీటిని పొందుతున్నారు. తాజాగా మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత కొత్తగా వాటర్ టాక్స్ విధిస్తుండడంతో ప్రజలు మున్సిపాలిటీ ఏర్పాటు చేసింది ఇందుకేనా అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ అంశంపైమున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ను విజయక్రాంతి ప్రతినిధి వివరణ కోరగా మిషన్ భగీరథ పథకంలో ‘ఇంట్రా’లో చేర్చకపోవడం వల్ల ఉచిత నీటి సరఫరా కార్యక్రమాన్ని అమలు చేయలేకపోతున్నట్లు చెప్పారు. మిగతా మున్సిపాలిటీలతో పోలిస్తే కేసముద్రం మున్సిపాలిటీలో వాటర్ టాక్స్ చాలా తక్కువ అని, నెలకు 100 రూపాయలు మాత్రమే వసూలు చేస్తున్నామని చెప్పారు.

ఇంట్రాలో ఉంటే వాటర్ టాక్స్ వసూలు చేసే అవకాశం ఉండేది కాదన్నారు. పంచాయతీలుగా ఉన్న సమయంలో అప్పటి సర్పంచులు ఇంట్రాలో చేర్చకపోవడం వల్లే ఇప్పుడు టాక్స్ వసూలు చేస్తున్నట్టు చెప్పారు. ఎక్కడైనా కనెక్షన్ లేకుండా వాటర్ టాక్స్ డిమాండ్ వేస్తే, గృహ యజమానులు చెల్లించాల్సిన అవసరం లేదని, విచారణ జరిపి వాటర్ టాక్స్ డిమాండ్ తొలగిస్తాం. 

టీ.శ్రీనివాసరావు, మున్సిపల్   కమిషనర్, కేసముద్రం మున్సిపాలిటీ