16 June, 2026 | 2:35 AM

అమెరికా ఇరాన్ మధ్య డీల్

16-06-2026 01:32 AM
  1. 19న ముహూర్తం.. స్విట్జర్లాండ్ వేదికగా సంతకాలు
  2. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన.. ఇరాన్ ధ్రువీకరణ 
  3. ఒప్పందంలో 14 అంశాలు కీలకం 
  4. 60 రోజులపాటు ఇరు దేశాల ప్రతినిధుల భేటీ 
  5. అణు పరీక్షలు, హోర్ముజ్ జలసంధి, యురేనియం, ఫ్రీజింగ్ నిధుల విడుదలపై ప్రధాన చర్చ

వాషింగ్టన్/టెహ్రాన్, జూన్ ౧౫: అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఇరు దేశాల ప్రతినిధులు స్విట్జర్‌ల్యాండ్ వేదికగా ఈనెల ౧౯న ఉభయ దేశాలు శాంతి ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా తన ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటించారు. ‘ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరింది’ అంటూ ధ్రువీకరించారు. కొద్దిసేపటి తర్వాత సుప్రీం నేషనల్ కౌన్సిల్ సెక్రటేరియట్ సైతం ఒప్పందాన్ని ధ్రువీకరించింది.

ఐఆర్‌జీసీ దళం అనుబంధ వార్త సంస్థ అయిన ఐఆర్‌ఐబీ ఈ ఒప్పందాన్ని ఇరాన్ సాధించిన గొప్ప విజయమని అభివర్ణించింది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్యవర్తిత్వంతోనే శాంతి ఒప్పందం కుదిరిందని అంతర్జాతీయంగా కథనాలు ప్రసారమవు తున్నాయి. శాంతిఒప్పందంతో ఇరు దేశాల మధ్య 107 రోజులుగా సాగుతున్న ఉద్రిక్తతలకు ఫుల్‌స్టాప్ పడ నుంది. హోర్ముజ్ తిరిగి తెరుచుకోనుంది. గల్ఫ్ నుంచి ఇంధన రవాణా మళ్లీ పట్టాలెక్కనున్నది. శాంతి ఒప్పందానికి ఇరు దేశాల మధ్య 14 అంశాలతో ముసాయిదా సిద్ధమైనట్లు ఇరాన్ అధికారిక మీడియా సంస్థ ‘మెహర్ న్యూస్ ఏజెన్సీ’ తన కథనాల ద్వారా వెల్లడించింది.

ఒప్పందం తర్వాత ౬౦ రోజులపాలు ఇరు దేశాల ప్రతినిధులు ఇరాన్‌కు సంబంధించిన అణు పరీక్షలు, హోర్ముజ్ తిరిగి తెరవడం, యురేనియం నిల్వలు, ప్రాంతీయ భద్రత, ఆర్థికపరమైన ఆంక్షల సడలింపు వంటి అంశాలపై చర్చిస్తారనేది కథనాల సారాంశం. ముఖ్యంగా అమెరికా స్తంభింపజేసిన 24 బిలియన్ డాలర్ల నిధులను 60 రోజుల వ్యవధిలో విడుదల చేయాలని, ఒప్పందానికి ముందే ఆ మొత్తంలో కొంత విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తున్నది. అలాగే, తమ ఓడరేవులపై దిగ్బంధనం (బ్లాకేడ్) ఎత్తివేయాలని ఇరాన్ షరతు విధించింది. యుద్ధం వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం అమెరికాతోపాటు తన మిత్రదేశాలు కనీసం 300 బిలియన్ డాలర్ల ప్యాకేజీ అందించాలని కూడా కోరుతున్నది.

అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం

యూఎస్, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం జరిగితే అంతర్జాతీయ ఇంధన రంగానికి పెద్ద ఊరట అని వాణిజ్య నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ చమురు రవాణాలో ౫వ వంతు వాటా కలిగిన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం వల్ల ముడిచమురు ధరలు అదుపులోకి వస్తాయి. ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే భారత్ వంటి దేశాలకు ఇంధన సంక్షోభ ముప్పు తప్పుతుంది. రానున్న 60 రోజుల చర్చల కాలంలో ఇరు దేశాలు శాశ్వత శాంతి నెలకొంటే ఇక అంతర్జాతీయ మార్కెట్లు పూర్తిగా ఊపిరి పీల్చుకున్నట్లే.

శాంతి ఒప్పందం ముసాయిదాలోని 14 అంశాలు

1. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు తక్ష ణం ఆపేయాలని, భవిష్యత్తులోనూ దాడు లు చేయొద్దని ఇరాన్ స్పష్టమైన డిమాండ్

2. ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా ఎలాంటి జోక్యం చేసుకోకూడదు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ సార్వభౌమత్వాన్ని అమెరికా గౌరవించాలి.

౩. ఇరాన్ ఓడరేవులపై అమెరికా నౌకాదళ దిగ్బంధాన్ని (బ్లాకేడ్) 30 రోజుల్లోపు ఎత్తివేయాలి.

4. ఇరాన్ సరిహద్దు ప్రాంతాల చుట్టుపక్కల మోహరించిన తన సైనిక బలగాల ను అమెరికా ఉప సంహరించుకోవాలి.

5. ఇరాన్ పర్యవేక్షణ ఏర్పాట్లకు లోబడి 30 రోజుల్లోపు హోర్ముజ్‌ని వాణిజ్య రవాణా కోసం తిరిగి తెరవాలి.

6. ఇరాన్ చమురు, పెట్రోకెమికల్ ఉత్పత్తులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని. ఆ వాణిజ్యం ద్వారా వచ్చే పూర్తి ఆదాయా న్ని పొందే హక్కు ఇరాన్‌కే ఉంటుంది.

7.యుద్ధం వల్ల దెబ్బతిన్న ఇరాన్ పునఃనిర్మాణానికి అమెరికాతోపాటు తన మిత్రదేశాలు 300 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీ అందించాలి.

8.అణు అంశాలు, ప్రాథమిక, ద్వితీయ శ్రేణి అమెరికా ఆంక్షల పూర్తి తొలగింపుపై తదుపరి చర్చలకు 60 రోజుల గడువు ఇవ్వాలి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, ఐఏఈఏ తీర్మానాల ఆధారంగా     చర్చలు సాగాలి.

9. అణ్వాయుధాలను తయారు చేయబోమని ఇరాన్ సంతకం చేయాలి.

10.రానున్న 60 రోజుల చర్చల సమయంలో ఇరాన్‌లో అమెరికా కొత్తగా సైనిక బలగాలను మోహరింపజేయకూడదు. ఆ విషయంలో ఇరాన్‌పై ఎలాంటి ఆంక్షలు విధించకూడదు.

11.విదేశాల్లో అమెరికా స్తంభింపజేసిన ఇరాన్‌కు చెందిన 24 బిలియన్ డాలర్ల నిధులను 60 రోజుల వ్యవధిలో విడుదల చేయించాలి. ఆ మొత్తంలో సగ భాగాన్ని చర్చలు ప్రారంభానికి ముందే ఇరాన్‌కు అప్పగించాలి.

12.తాత్కాలిక శాంతి ఒప్పందం పారదర్శకంగా అమలు చేయడంతోపాటు పర్య వేక్షించేందుకు ఒక ప్రత్యేక పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.

13.ఇరు దేశాల మధ్య కుదిరే తుది సమగ్ర ఒప్పందాన్ని ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతా మండలి అధికారిక తీర్మానం ద్వారా ఆమోదింపజేయాలి.

14.నిధుల విడుదల, చమురు ఆంక్షల సడలింపు, నౌకాదళ దిగ్బంధనం ఎత్తివేత ప్రక్రియలు పూర్తయిన తర్వాతే తుది శాంతి చర్చలు ప్రారంభించాలి. ఆ చర్చలు కేవలం సుసంపన్నమైన అణు నిల్వలు, ఆంక్షల ఉపసంహరణ, ఇరాన్ ఆర్థిక పునః నిర్మాణానికి మాత్రమే పరిమితమై ఉండాలి. ఇరాన్ క్షిపణి పరీక్ష లు, ప్రాంతీయ నిరోధక సమూహాలకు మద్దతిచ్చే అంశాలు ఎజెండాలోకిరావు.

శాంతి నచ్చని నెతన్యాహు

  1. తమ సైనిక బలగాలను ఉపసంహరించబోమని స్పష్టీకరణ 
  2. లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు..  ముగ్గురు మృతి

బీరుట్/ టెల్‌అవీవ్, జూన్ ౧౫: ఇరాన్, అమెరికా మధ్య శాంతి ఒప్పందం తమకు నచ్చలేదని ఇజ్రాయెల్ సంచలన ప్రకటన చేసింది. లెబనాన్‌పై దాడులు కొనసాగిస్తూ ఉంటామని తేల్చిచెప్పింది. చెప్పడమే కాదు.. ఆచరణలోనూ చేసి చూపించింది. సోమవారం లెబనాన్ రాజధాని బీరుట్ పై భీకర దాడులకు పాల్పడింది. ‘దాహియే’ ప్రాంతంలో జరిపిన వైమానిక దాడుల్లో ముగ్గురు మృతిచెందారు.

మరికొందరు క్షతగాత్రులయ్యారు. శాంతి ఒప్పందం కుదిరిందని అమెరికా-, ఇరాన్ దేశాలు ప్రకటిం చిన కొద్దిగంటలకే ఇజ్రాయెల్ దాడులకు పాల్పడటం కలకలం రేపింది. దాడుల విషయంలో అమెరికా నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చి నా లొంగే ప్రసక్తే లేదని, దాడులు మరింత ఉధృతంగా కొనసాగుతాయని కుండబద్దలు కొట్టింది. ఒక్క లెబనానే కాదు.. సిరియా, గా జాలోనూ తమ ఇజ్రాయెల్ సైన్యాలు కాపు కాస్తూనే ఉంటాయని కూడా తేల్చిచెప్పింది.

తమ సరిహద్దులను, పౌరులను రక్షించుకునేందుకు కాలపరిమితి అనేది లేకుండా ఆయా దేశాల్లో తమ బలగాలు మోహరిస్తాయని వెల్లడించింది. ముఖ్యంగా లెబనాన్‌లో ని హిజ్బుల్లా ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేస్తామని ప్రకటించింది. ఇరాన్‌తో అమెరికా కుదుర్చుకున్న ఒప్పందంతో తమకెలాంటి సంబంధం లేదని వెల్లడించింది. తమ దేశం ఒక సార్వభౌమ దేశమని, తాము ఈ ఒప్పందంలో భాగస్వాములం కాబోమని తెలిపిం ది. లెబనాన్ విషయంలో ఇరాన్ జోక్యం చేసుకుంటే, ఆ దేశాన్ని కూడా వదిలిపెట్టబోమని హెచ్చరికలు జారీ చేసింది.

వెనక్కి తగ్గేదే లేదు: ఇజ్రాయెల్

ఇరాన్, అమెరికా మధ్య శాంతి ఒప్పంద నిబంధనలకు కట్టుబడి ఉండే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ తాజాగా స్పష్టం చేశారు. అమెరికా నుంచి ఒత్తిళ్లను పట్టించుకోబోమని తేల్చిచెప్పారు. లెబనాన్, సిరియా, గాజాలోని భద్రతా వలయాల్లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కాపు కా స్తూనే ఉంటాయని స్పష్టం చేశారు. హి జ్బొ ల్లా స్థావరాలను నామరూపల్లేకుండా చేస్తామని, మునపటి కంటే ఉధృతంగా దా డులు చేస్తామని తెలిపారు. ఇరాన్‌తో అమెరికా కు దుర్చుకున్న ఒప్పందంతో తమకెలాం టి సం బంధం లేదని వెల్లడించారు. తమ దేశం ఒక సార్వభౌమ దేశమని, తాము ఈ ఒ ప్పందంలో భాగస్వామి కాబోమన్నారు.