16 June, 2026 | 2:36 AM

పెన్షన్ కోసం గోస

16-06-2026 01:21 AM
  1. సమయానికి అందక రిటైర్డ్ ఉద్యోగుల ఎదురుచూపులు
  2. 1 నుంచి 8వ తేదీ వరకు ఎప్పుడు జమవుతుందో తెలియని దుస్థితి
  3. అవసరానికి అందక ఆర్థిక ఇబ్బందులు

హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): సమయానికి పెన్షన్ అందక ప్రభుత్వ పెన్షన్‌దారులు గోసపడుతున్నారు. ఒకటో తేదీ నుంచి 8వ తేదీ వరకు ఎప్పుడు పెన్షన్ చేతికొస్తుందోనని రిటైర్డ్ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. అవసరానికి, సమయానికి డబ్బు అందక పోవడంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలిస్తున్నట్లే తమకు కూడా ప్రభుత్వం ఒకటో తేదీనే పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వంలోని పలు శాఖల్లో దాదాపు 5 వేల మంది పెన్షనర్లకు అందరిలాగా పెన్షన్ సమయానికి వారి ఖాతా ల్లో జమకావడంలేదు. 20 నుంచి 30 ఏళ్ల పాటు ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి వీరం తా సేవలందించారు. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, రోజువారీ పరిపాలన వ్యవహారాలకు సంబం ధించి ఏళ్ల తరబడిగా సేవలందించిన వీరిపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే పెన్షనే తక్కువ. అదికూడా సమయానికి చేతికందకపోవడంతో వారి అవసరాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.

ప్రభుత్వ ఉద్యోగులకు ఏవిధంగానైతే ఒకటో తేదీన వేతనాలను ప్రభుత్వం చెల్లిస్తుందో అదేతరహాలో తమకు కూడా సమయానికి పెన్షన్ వేసేలా అన్నిశాఖలకు ఉత్తర్వులు జారీ చేయాలని పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే క్యాడర్‌ను బట్టి పెన్షన్ పరిమితి ఉంటుంది. నెలకు సుమారు రూ.22 వేల నుంచి రూ.1.30 లక్షల వరకు పెన్షన్ అందుకునే వారు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డీటీఓ/ఎస్టీవోల ద్వారా పెన్షన్ పొందుతున్న సుమారు రెండున్నర లక్షలకు పైగా పెన్షనర్లు 1వ తేదీన లేదా 2వ తేదీన పెన్షన్లు పొందుతున్నారు.

కానీ ఓ 5వేల మందికిపైగా రిటైర్డు న వారికి 7వ తేదీ లేదా 8వ తేదీ వరకు చెల్లింపులు జరుగుతున్నాయి. రిటైర్డున క్లాస్ ఫోర్త్ ఎంప్లాయీస్‌కు సుమారు రూ.22 వేల వరకు పెన్షన్ వస్తే, అదే ఓ రిటైర్డ్ తహసీల్దార్‌కు రూ.83 వేల వరకు పెన్షన్ అందుకుం టారు. అయితే తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ, ఇంటర్మీడియట్ బోర్డు, యూనివర్సిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థలు, ఎయిడెడ్ కాలేజీలు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీల్లో సేవ లందించి రిటైర్డైన వారికి పెన్షన్ సకాలంలో అందడంలేదు.

కొన్ని సార్లు నెల చివరలో అందుతుందని పెన్షన్ దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీల్లోని రిటైర్డున నాన్ టీచింగ్ ఉద్యోగుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లోని రిటైర్డైన నాన్ టీచింగ్ స్టాఫ్‌కు మాత్రం పెన్షన్ ఆలస్యంగా అందుతుందని వాపోతున్నారు. 

మాకూ ఉత్తర్వులివ్వాలి: పెన్షనర్ల జేఏసీ

ఈనెల 9వ తేదీన రాష్ట్రంలోని వివిధ శాఖల్లో సేవలందిస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థలు, యూనివర్సిటీలు, కార్పొరేషన్లు, సొసైటీలతోపాటు అన్ని ప్రభుత్వ విభాగాల కింద పని చేస్తున్న ఉద్యోగులకు ప్రతి నెలా 1వ తేదీన జీతాలు చెల్లించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విధంగానే పెన్షనర్లకు కూడా జారీ చేయాలని పెన్షనర్ల జేఏసీ డిమాండ్ చేస్తోంది. వారికి లాగా తమకూ 1వ తేదీన పెన్షన్ చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతున్నారు.

ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల్లో అన్ని రకాల ఉద్యోగులను ప్రస్తావించి, పెన్షనర్లను విస్మరించడం బాధాకర మన్నారు. సమయానికి పెన్షన్ సకాలం లో అందకపోవడంతో అప్పులుచేసి, అవసరా లు తీర్చుకుందామన్న అప్పుపుట్టని పరిస్థితి ఉందన్నారు. వైద్యం, రోజూవారీ ఖర్చుల కు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. పెన్షన్‌పైనే ఆధారప డి జీవిస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వ పెన్షన్‌దారుల సంయుక్త కార్యాచరణ సమితి పేర్కొంది.