16 June, 2026 | 2:44 AM

ప్రమాద ఘంటికలు

16-06-2026 01:43 AM

నిర్లక్ష్యం  నీడన  సింగూరు  డ్యామ్!

  1. ఆయకట్టు పరిధిలో పంటల విరామ ముప్పు?
  2. ప్రాజెక్టులో నీరు 15 టీఎంసీలకే పరిమితం
  3. నత్తనడకన సాగుతున్న పనులు 
  4. డ్యామ్ సేఫ్టీ రూల్స్ బేఖాతర్
  5. కాంట్రాక్టర్ తీరుపై అన్నదాతల ఆగ్రహం

సంగారెడ్డి, జూన్ 15 (విజయక్రాంతి): ఉమ్మడి మెదక్ జిల్లా వ్యవసా య రంగానికి వెన్నెముకగా, హైదరాబాద్ జంట నగరాల దాహార్తిని తీర్చే ప్రధాన వనరుగా ఉన్న సింగూరు మల్టీపర్పస్ ప్రాజెక్టు (మంజీరా నది) ప్రస్తుతం అత్యంత కీలకమై న దశను ఎదుర్కొంటోంది. ప్రాజెక్టు భద్రతపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ప్రస్తుతం రిజర్వాయర్‌లో యుద్ధప్రాతిపదికన మరమ్మ తులు సాగుతున్నాయి.

అయితే సింగూరు ప్రాజెక్టు మరమ్మతు పను ల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, పనుల మందగమనంపై క్షేత్రస్థాయిలో తీవ్ర అసం తృప్తి వ్యక్తమవుతోంది. ఇటీవల ఎన్‌డీఎస్‌ఏ ఉన్నతాధికారుల తనిఖీల్లో కూడా స్పష్టమైంది. మార్చిలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి చెందిన ఉన్నత స్థాయి నిపుణుల బృందం సింగూరు ప్రాజెక్టును నేరుగా సందర్శించి, సాగుతున్న పనులను పరిశీలించింది. ఆ సమయంలో కాంట్రాక్టర్ వ్యవహరించిన తీరుపై వారు తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఇంత పెద్ద ప్రాజెక్టు అత్యంత ప్రమాదకర స్థితిలో ఉంటే, కాంట్రాక్టర్ క్షేత్రస్థాయిలో కేవలం ఒక్క జేసీబీ, ఒక ట్రక్కును మాత్రమే ఉపయోగించి పనులు చేయడంపై అధికారులు తీవ్రస్థాయిలో మండిపడినట్లు తెలిసింది. రిజర్వాయర్ ఎర్త్ డ్యాం లోపలి భాగంలో ఎక్కడైతే రివిట్‌మెంట్ తీవ్రంగా దెబ్బతిని బుంగలు పడ్డాయో, అక్కడ మొదట పనులు ప్రారంభించాల్సింది పోయి.. డ్యాంకు ఒక చివర నుంచి సాధారణ పద్ధతిలో పనులు చేపట్టడంపై నిపుణులు తప్పుపట్టారు. అయితే కాంట్రాక్టర్‌కు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడంతోనే పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

సింగూరు నీటి నిల్వ సగమే

వానాకాలం సీజన్‌లో ప్రాజెక్టు పూర్తి సామర్థ్యంతో కాకుండా కేవలం 15 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. సింగూరు ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 29.91 టీఎంసీలు కాగా, రివిట్‌మెంట్‌లో ఏర్పడిన బుంగలు, లీకేజీల కారణంగా రక్షణ చర్యల్లో భాగంగా నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం మరమ్మతు పనుల కోసం నీటి నిల్వను గతంలో 8 టీఎంసీలకు తగ్గించగా, వేసవి అవసరాల తర్వాత ప్రస్తుతం అది మరింత పరిమితమయ్యే అవకాశం ఉంది.

ఈ వానాకాలంలో కర్ణాటక, మహారాష్ట్ర క్యామెంట్ ఏరియాల నుంచి భారీగా వరద నీరు వచ్చినా.. రక్షణ దృష్ట్యా 15 టీఎంసీలకు మించి నిల్వ చేయకుండా మిగిలిన నీటిని గేట్లు ఎత్తి దిగువకు వదలాలని నిర్ణయించారు. డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ (డీఎస్‌ఆర్పీ) హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ పనులను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రాజెక్టు ఆధునికీకరణ, గేట్లు, హోయిస్ట్ పరికరాలు, స్టాప్ లాగ్ ఎలిమెంట్స్, గ్యాంట్రీ క్రేన్ల మరమ్మతుల కోసం ప్రభుత్వం సుమారు రూ. 22 కోట్ల నిధులు మంజూరు చేయగా, పనులు చేపట్టారు. అలల తాకిడికి దెబ్బతిన్న రిజర్వాయర్ లోపలి భాగంలోని పాత రివిట్‌మెంట్లు తొలగించి, రాళ్లతో కొత్తగా పటిష్టమైన నిర్మాణాలు చేపడుతున్నారు.  

జంట నగరాల దాహార్తి తీరుతుందా?

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, మణికొండ వంటి పశ్చిమ ప్రాంతాలకు సింగూరే ప్రధాన తాగునీటి వనరు. వేసవిలో నీటి నిల్వలు తగ్గినప్పటికీ, హైదరాబాద్ జలమండలి ఎమర్జెన్సీ పంపింగ్ ద్వారా నీటి సరఫరాను క్రమబద్ధీకరించింది. ఈ సీజన్‌లో నిల్వ చేయబోయే 15 టీఎంసీల నీరు జంట నగరాల తాగునీటి అవసరాలకు (ఏడాదికి దాదాపు 4 టీఎంసీలు అవసరం),  పరిశ్రమలకు పూర్తిగా సరిపోతుంది. దీంతో హైదరాబాద్ తాగునీటి సరఫరాకు ఎలాంటి ముప్పు లేదని అధికారవర్గాలు చెపుతున్నాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యపు పనులపై వివరణ కోరేందుకు ఇరిగేషన్ శాఖ డీఈని సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

వానాకాలంలో క్రాప్ హాలిడే?

వానాకాలం సీజన్ ముంచుకొస్తున్న వేళ.. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పనులు మరింత ఆలస్యమైతే  సాగు, తాగునీటి సరఫరాపై ప్రభావం పడనుంది. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అధికారికంగా దాదాపు 40 వేల ఎకరాల ఆయకట్టుకు ఈ ప్రాజెక్టు నీరందిస్తున్నప్పకీ సుమారు 80వేల ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. ప్రాజెక్టు సామర్థ్యాన్ని 15 టీఎంసీలకే పరిమితం చేస్తున్నందున, వానాకాలం సాగునీటి విడుదలపై ప్రభావం ఉండే అవకాశం ఉంది.

అయితే క్యామెంట్ ఏరియా నుంచి వచ్చే వరద నీటిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ పంటలకు నీరు విడుదల చేయాలని ఇరిగేషన్ శాఖ భావిస్తోంది. అయితే పూర్తి నిల్వ లేకపోవడం వల్ల రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరమ్మతు పనులు నత్తనడకన కొనసాగడంతో వానాకాలం సీజన్‌లో క్రాప్ హాలిడే ప్రకటించే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకు మిషన్ భగీరథ నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. పనులు పూర్తి కాకపోతే ఈ వానాకాలం వరదలు వచ్చినా రక్షణ దృష్ట్యా కేవలం 15 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ ఉంచగగుతారు.

మిగిలిన నీటిని వృథాగా దిగువకు వదలాల్సి వస్తుంది. ఎన్‌డీఎస్‌ఏ హెచ్చరికలు, ప్రభుత్వం నుండి వచ్చిన ఒత్తిడితో ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రస్తుతం కాంట్రాక్టర్‌పై నిఘా పెంచారు. యంత్రాల సంఖ్యను, కూలీల సంఖ్యను పెంచి వర్షాకాలం ఉధృతి పెరగక ముందే ప్రధాన పనులను ఒక కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలిసింది. 

పనుల్లో నాణ్యతా లోపం?

సింగూరు ప్రాజెక్టుపై కొన్ని చోట్ల జరుగుతున్న పనుల నాణ్యత ఎన్‌డీఎస్‌ఏ ప్రమాణాలమేరకు చేపట్టడంలేదని అధికారులు హెచ్చరించారు. ఈ నిర్లక్ష్యంపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు రక్షణ విషయంలో రాజీ పడబోమని, కాంట్రాక్టర్లు ఒకే సీజన్ లోపల పనులన్నీ పూర్తిచేయాలని కఠినంగా ఆదేశించారు.

పనులను వేగవంతం చేయకపోతే క్రాప్ హాలిడే (పంటల విరామం) ప్రకటించాల్సి వస్తుందని, అది రైతులకు నష్టం కలిగిస్తుందని కాంట్రాక్టర్‌ను, స్థానిక ఇరిగేషన్ అధికారులను హెచ్చరించారు. నీటి అడుగున ఎక్కడైనా పగుళ్లు లేదా లీకేజీలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి సోనార్ పరీక్షలు, అండర్ వాటర్ సర్వేలు త్వరితగతిన నిర్వహించాలని మంత్రి సూచించారు.