కాంగ్రెస్ గూటికి పోచారం
బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్
- మాజీ స్పీకర్‌కు కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్‌రెడ్డి
- మంత్రి పొంగులేటితో కలిసి పోచారం నివాసానికి సీఎం
- పోచారానికి ప్రభుత్వంలో సముచిత స్థానం ఉంటుంది
- రైతు సంక్షేమ రాజ్యం కోసం అందరిని కలుపుకొని ముందుకెళ్తాం: సీఎం
హైదరాబాద్, జూన్ 21 ( విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. కారు పార్టీకి షాక్‌లు మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరగా, తాజాగా మాజీ స్పీకర్, మాజీ మంత్రి, బాన్సువాడ బీఆర్‌ఎస్ సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు శుక్రవారం హైదరాబాద్‌లోని పోచారం నివాసానికి వెళ్లి భేటీ కావడం, కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించడం చకచకగా జరిగిపోయాయి.
పార్టీలో, ప్రభుత్వంలో సము చిత స్థానం ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇవ్వడంతో ఆయన కూడా ఒకే చెప్పి, తనయుడితో కలిసి హస్తం గూటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా సీని యర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిశామని, సీనియర్ నేతగా, పెద్దలుగా ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరామన్నారు. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారని, రైతుల సంక్షేమంపై వారి సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు.
రైతు రుణమాఫీ విధివిధానాలపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సీఎం పేర్కొన్నారు. భవిష్య త్‌లో పోచారం శ్రీనివాస్‌రెడ్డికి సముచిత గౌరవం ఇస్తామన్నారు. నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ఆయన సహకారం తీసుకుంటామన్నారు. ఇది రైతు రాజ్యమని, రైతు సంక్షేమ రాజ్యం కోసం అవసరమైన వారందరిని కలుపుకొని ముందుకు వెళ్తామని సీఎం స్పష్టం చేశారు.
మరో 20 ఏళ్లు రేవంత్‌రెడ్డినే సీఎం: పోచారం
తెలంగాణ రైతుల సంక్షేమం, బాన్సువాడ ప్రజల సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు పోచారం తెలిపారు. తాను రైతుల సంక్షేమం తప్ప ఏదీ ఆశించడం లేదని, సీఎం రేవంత్‌రెడ్డి రైతుల పక్షపాతి అని, రైతులకోసం చేస్తున్న కార్యక్రమాలను తాను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పలు సమస్యలను సీఎం అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నారని, తెలంగాణ రాష్ట్రాన్ని 20 ఏళ్లు పాలించే సత్తా రేవంత్‌రెడ్డికి ఉందన్నారు. అలాగే సుదీర్ఘకాలం తర్వాత తిరిగి సొంత గూటికి రావడం సంతోషంగా ఉందని పోచారం అన్నారు. సాగు, తాగునీటి ప్రాజెక్టుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుం టున్న నిర్ణయాలను అభినందిస్తున్నట్లు తెలిపారు.
తనను బలవంతంగా కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారని బీఆర్‌ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై పోచారం స్పందిస్తూ.. బలవంతంగా చేర్చుకోవడానికి నేను చిన్నపిల్లాడిని కాదని, రైతు ల సంక్షేమం కోరుకునే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. తన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ నుంచే ప్రారంభమైందన్నారు. కాంగ్రెస్‌లో చేరిక వెనుక రాజకీయంగా ఆశిస్తున్నది ఏమీ లేదని, మంచి ఆలోచనలతో సీఎం ఆహ్వానించారని, అందుకే పార్టీలో చేరినట్లు తెలిపారు. ప్రగతి కోసం కలిసి ముందడుగు వేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు, పనిచేసే నాయకత్వా న్ని సమర్ధించేందుకు రేవంత్‌కు మద్దతిస్తున్నామన్నారు. ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.






