సింగరేణికి నష్టం రానియ్య
- తెలంగాణ బిడ్డగా హామీ ఇస్తున్నా
- ఒడిశా నైనీ కోల్ బ్లాక్‌ను తెరిపిస్తా
సింగరేణికి మరో రెండు బ్లాకులు
సంస్థ కేంద్ర ప్రభుత్వానిది కూడా
రాజకీయాలు చేయొద్దు
డిప్యూటీ సీఎం భట్టి సూచనలు పరిశీలిస్తాం
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
10వ విడత కోల్ బ్లాక్‌ల వేలం పాట
హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): తెలంగాణ బిడ్డగా సింగరేణికి ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం జరగనివ్వనని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. సింగరేణి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. శుక్రవారం హైటెక్ సిటీలోని మైండ్ స్పేస్‌లో 10వ విడత బొగ్గు గనుల వేలంను కేంద్ర మంత్రి సతీష్ చంద్ర దూబే సమక్షంలో కిషన్‌రెడ్డి ప్రారంభించారు. కొత్తవి 60, పాతవి 7 కలిపి మొత్తం 67 గనులకు వేలంపాట నిర్వహించారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ కార్యక్రమానికి ప్రత్యేక అథితిగా హాజరయ్యారు. ఈ వేలంపాట జాబితాలో తెలంగాణకు చెందిన శ్రావణపల్లి గని కూడా ఉండటంతో రాజకీయ దుమారం రేగింది. తెలంగాణలోని గనులను సింగరేణికి ఇవ్వకుండా, వేలంపాట పెట్టి ప్రైవేటు సంస్థలకు ఇవ్వడంపై అటు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యరంతం తెలిపాయి. ఈ వ్యవహారంపై కిషన్ రెడ్డి స్పందించారు.
కేంద్రం సింగరేణికి ఎలాంటి అన్యాయం చేయడం లేదని, కోల్ ఇండియా కంటే అధిక ప్రాధాన్యం ఇస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు. 2015లో సింగరేణికి కేటాయించిన నైనీ కోల్ బ్లాక్‌ను తెరిపించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. కొన్ని సమస్యల కారణంగా ఒడిశాలోని నైనీ బ్లాక్‌లో ఇంతవరకు బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కాలేదని తెలిపారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఒడిశా ప్రభుత్వంతో మాట్లాడి వీలైనంత త్వరగా నైనీ కోల్ బ్లాక్‌లో ఉత్పత్తి ప్రారంభమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. సింగరేణి ఉత్పత్తిలో దాదాపు 15 శాతం బొగ్గు నైనీ కోల్ బ్లాక్ ద్వారా రావాలని, ఇది సంస్థకు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు.
ప్రధాని మోదీతో మాట్లాడి సంస్థ బలోపేతానికి చర్యలు తీసుకుంటానని, కార్మికులకు న్యాయం చేస్తానని, వారు ఎలాంటి ఆందోళన చెందొద్దని సూచించారు. సింగరేణికి ఇచ్చేందుకు కేంద్రం దృష్టిలో రెండు గనులు ఉన్నాయని కిషన్‌రెడ్డి వెల్లడించారు. సింగరేణి రాష్ట్ర ప్రభుత్వానిది మాత్రమే కాదని, కేంద్రానిది కూడా అని చెప్పారు. సంస్థపై రాష్ట్ర సర్కారుకు ఎంత బాధ్యత ఉంటుందో, కేంద్రానికి కూడా అంతే ఉంటుందని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమర్క సూచించిన అంశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. సింగరేణిపై ఎవరూ రాజకీయం చేయొద్దని, రాజకీయలకు అతీతంగా సంస్థకు మద్దతుగా ఉండాలని కోరారు. అన్ని పరిశ్రమలకు బొగ్గు రంగం జీవనాడి అని అన్నారు. సమిష్టి కృషి ద్వారా బొగ్గు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలని, తద్వారా బొగ్గులో భారతదేశాన్ని ఆత్మనిర్భర్‌గా మార్చాలన్న ప్రధానమంత్రి ఆకాంక్షను నెరవేర్చాలని పిలుపునిచ్చారు.
గనుల వేలం కేంద్రం రెవెన్యూ కోసం కాదు
బొగ్గు గనుల వేలం కేంద్రానికి ఆదాయం సమకూర్చేందుకు కాదని, సుప్రీంకోర్డు మార్గర్శకాలకు అనుగూనంగా నిర్వహిస్తున్నట్లు కిషన్‌రెడ్డి చెప్పారు. బొగ్గు గనులు లాభాల బాటలో ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం పెరగాలని, దేశంలో బొగ్గు కొరత లేకుండా ఉండాలని, మైనింగ్‌లో పారదర్శకత ఉండాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 20015 నుంచి బొగ్గు బ్లాకులను వేలం వేస్తోందని వివరించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా ప్రైవేటు సంస్థలకు బొగ్గు గనులను అప్పగించారన్న విషయాన్ని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. తాను బొగ్గు శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి అధికార కార్యక్రమాన్ని సొంత గడ్డ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకున్నట్లు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బొగ్గు గనులను వేలం వేయడం వల్ల ఎవరికి నష్టం, ఎవరి లాభం అనే వివరాలను రెండుమూడు రోజుల్లో పూర్తిస్థా యిలో వెల్లడిస్తామని తెలిపారు.
వేలం లేకుండా గనులివ్వండి
- సింగరేణికి రిజర్వేషన్ కోటాలో కేటాయించండి
- సంస్థ సమస్యలపై అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్తాం
హైదరాబాద్, జూన్ ౨౧ (విజయక్రాంతి): సింగరేణి వంటి ప్రభుత్వ సంస్థలకు కేంద్రం కొత్తగా తెచ్చిన చట్టంలోని 17 (ఏ) నిబంధన ప్రకారం రిజర్వేషన్ ప్రక్రియ ద్వారా బొగ్గు బ్లాకులు కేటాయించే అవకాశం ఉన్నా.. దానిని పక్కన పెట్టి వేలం పాటలో ప్రైవేట్ సంస్థలకు బ్లాకులను అప్పగించడం బాధాకరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో ఇంకా మిగిలి ఉన్న 1400 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీసేందుకు వీలుగా గనుల చట్ట ప్రకారంగా రిజర్వేషన్ కోటాలో సింగరేణి సంస్థకు గనులు కేటాయించాలని విజ్ఞప్తి చేసారు.
బొగ్గు బ్లాకుల వేలం కార్యక్రమంలో శుక్రవారం ఆయన కీలక ప్రసంగం చేశారు. తాను తెలంగాణ ప్రభుత్వం తరఫున సింగరేణికి మద్దతుగా వేలంపాటకు వచ్చినట్లు తెలిపారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న సింగరేణి సంస్థ ఇప్పుడు 39 గనులతో నడుస్తున్నప్పటికీ కొత్త గనుల కేటాయింపు లేకపోతే సంస్థ భవిష్యత్ అంధకారంగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. రానున్న ఐదు సంవత్సరాల్లో 8 భూగర్భ గనులు, మూడు ఓపెన్ కాస్ట్‌లు మూతపడుతాయని తెలిపారు. 2032 నాటికి మరో ఐదు భూగర్భ, ఆరు ఓపెన్ కాస్ట్ గనుల కాలం తీరుతుందని వెల్లడించారు. ఈ విధంగా చూస్తే ప్రస్తుతం 39 గనులు, 40 వేల మంది కార్మికులున్న సింగరేణి మరో 15 ఏళ్లలో 8 గనులు, ఎనిమిది వందల మంది కార్మికుల స్థాయికి పడిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఢిల్లీకి అఖిల పక్షం
సింగరేణి సమస్యల పరిష్కారానికి ప్రధానమంత్రితో మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడి ఒప్పించాలని భట్టి కోరారు. అవసరమైతే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి, ప్రధానిని కలిసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తెలంగాణ బిడ్డగా కిషన్‌రెడ్డి సింగరేణికి న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తప్పిదం వల్ల గతంలో నిర్వహించిన వేలంపాటలో సత్తుపల్లి బ్లాక్ -3, కోయగూడెం బ్లాకులు ప్రైవేటు కంపెనీలు దక్కించుకున్నాయని ఆరోపించారు. గనులను పొందిన ప్రైవేటు కంపెనీలు ఇప్పటివరకు అక్కడ బొగ్గు తవ్వకాలు ప్రారంభించలేదని, కనుక చట్ట ప్రకారం ఆ కేటాయింపులు రద్దుచేసి వాటిని సింగరేణికి కేటాయించాలని కోరారు.
గనుల వేలం పాట
బొగ్గు బ్లాకుల కేటాయింపుదారులకు వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు తాము అన్ని రకాలుగా సహాయ, సహకారాలు అందిస్తామని బొగ్గు, గనుల సహాయమంత్రి సతీష్‌చంద్ర దూబే చెప్పారు. శుక్రవారం నాటి వేలంలో బీహార్‌లో 3, ఛత్తీస్‌గఢ్‌లో 15, జార్ఖండ్‌లో 6, మధ్యప్రదేశ్‌లో 15, మహారాష్ర్టలో 1 , ఒడిశాలో 16 , పశ్చిమ బెంగాల్‌లో 3, తెలంగాణలో 1 కలిపి మొత్తం 60 కొత్త గనులకు వేలం ప్రారంభించారు. ఈ వేలాన్ని కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి అమృత్ లాల్ మీనా, అదనపు కార్యదర్శి నాగరాజు పర్యవేక్షించారు. వేలంలో తెలంగాణకు చెందిన బెల్లంపల్లిలోని శ్రావణపల్లి గని కూడా ఉంది. వేలంలో ఏ గని ఎవరికి దక్కిందనే విషయాన్ని కేంద్రం కటాఫ్ తేదీ ముగిసిన తర్వాత వెల్లడించనుంది.






