12 May, 2026 | 5:55 AM

బియ్యం రీసైక్లింగ్ వద్దు

22-06-2024 12:25 AM
  1. రేషన్ దుకాణాల్లో త్వరలో సన్నబియ్యం పంపిణీ

ముకాంబిక రైస్, గ్రెయిన్స్ టెక్ ఎక్స్‌పోలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 21 (విజయక్రాంతి): రేషన్ దుకాణాలలో త్వరలోనే దొడ్డు బియ్యానికి బదులుగా సన్న బియ్యం పంపిణి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మిల్లర్లు ఎవరూ దళారుల నుంచి రేషన్ బియ్యం కొనుగోలు చేయొద్దన్నారు. దళారుల నుంచి బియ్యం కొనుగోలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. పీడీఎస్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసే మిల్లులపై కఠిన చర్యలు తప్పవని చెప్పారు. తెలంగాణ స్టేట్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నిర్వహిస్తున్న 16వ మూకాంబిక రైస్, గ్రెయిన్స్ టెక్ ఎక్స్‌పో 2024ను శుక్రవారం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఒక పరిశ్రమ స్థాయికి రైస్‌మిల్లులు ఎదగాలని అన్నారు. రైస్ మిల్లర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. రేషన్ షాపులలో త్వరలో సన్నబియ్యం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలియజేశారు. రైసింగ్ మిల్లింగ్ ఇండస్ట్రీకి బ్యాంకింగ్, విద్యుత్, ఇతర సదుపాయాలు కల్పిస్తామన్నారు. ప్రభుత్వపరంగా రాయితీలు అందిస్తామన్నారు. ధాన్యం కొనుగోలులో అన్నదాత లకు ఇబ్బందులు లేకుండా చూడాలని రైస్ మిల్లర్లను మంత్రి కోరారు.