23 July, 2026 | 1:50 AM

రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణుల ధర్నా

23-07-2026 12:00 AM

నూతనకల్, జులై 22: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ బుధవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సూర్యాపేట - దంతాలపల్లి ప్రధాన రహదారిపై పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కట్ట మల్లారెడ్డి, తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డిలు మాట్లాడుతూ.. నీట్ (NEET) పరీక్ష పేపర్ లీకేజీ వంటి వరుస ఘటనలతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులకు అండగా నిలిచిన రాహుల్ గాంధీని అరెస్టు చేయడం పూర్తిగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వారు తీవ్రంగా విమర్శించారు.విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం వారి భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని వారు మండిపడ్డారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బురెడ్డి సంజీవరెడ్డి, దరిపల్లి వీరన్న, బొడ్డుపల్లి అంజయ్య, చురకంటి చంద్రారెడ్డి, జటంగి గణేష్, బంటు బద్రి, పగిళ్ల అశోక్ రెడ్డి, పాండవ లింగయ్య, లింగాల రామచంద్రయ్య, తుంగతుర్తి విద్యాసాగర్, యూత్ కాంగ్రెస్ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.