లెక్క ఎక్కడ తప్పింది!
- ఓట్ల శాతం పెరిగినా సీట్లు తక్కువే
14 స్థానాలు అనుకుంటే ఎనిమిదికే పరిమితం
అభ్యర్థుల ఎంపికలో తప్పిదాలే కారణమా?
కాంగ్రెస్ పార్టీ నేతల అంతర్మథనం
హైదరాబాద్, జూన్5 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల్లో తమ లెక్క తప్పడానికి గల కారణాలపై అధికార కాంగ్రెస్ పార్టీ విశ్లేషణ చేస్తోంది. 14 సీట్లలో పాగా వేస్తామ నుకున్న హస్తం పార్టీ 8 సీట్లకే పరిమితం కావడంపై అంతర్మథనం మొదలైంది. అభ్యర్థుల ఎంపికలో తప్పిదమా? లేక బీజేపీకి బీఆర్‌ఎస్ సహకారం వల్ల నష్టం జరిగిందా? అనేదానిపైన పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 39.5 శాతం ఓట్లతో 64 సీట్లలో కాంగ్రెస్ విజయం సాధించింది.
పార్లమెంట్ ఎన్నికల్లో 41 శాతానికి పెరిగినా 8 సీట్లే రావడానికి టికెట్ల కేటాయింపులో పొరపాట్లే కారణమని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. మెదక్, చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌లో ఈ తప్పిదం జరిగిందని అంచనా వేస్తున్నారు. ఈ విషయంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జితో పాటు కొందరు మంత్రులు పార్టీ అధిష్టానంపై తెచ్చిన ఒత్తిడి వల్లే ప్రతికూల ఫలితాలు వచ్చాయంటున్నారు.
అభ్యర్థుల ప్రకటనలో జాప్యం..
ఐదారు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికలో జాప్యంతో పాటు మరికొన్నింటిలో సెలెక్షన్ సరిగ్గా జరగలేదనే భావన కాంగ్రెస్‌లో వ్యక్తమవుతోంది. ఎంపీ ఎన్నికల్లో పోటీకి బలమైన నాయకులు లేక ఇతర పార్టీల నుంచి చేర్చుకుని టికెట్లు ఇవ్వాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినవారికీ అవకాశం ఇచ్చారు. అభ్యర్థులను తొందరగా ప్రకటించిన సెగ్మెంట్లలో పార్టీ విజయం సాధించిందని, ఆలస్యమైన ప్లేసుల్లోనే ఓడిపోయామని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. కరీంనగర్, సికింద్రాబాద్, ఖమ్మం, హైదరాబాద్‌లో నామినేషన్ ముగుస్తుందనగా ఎంపిక చేశారు.
సికింద్రాబాద్‌లో దానం నాగేందర్ పార్టీ చెప్పినా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే బరిలో దిగారు. దానం గెలిస్తే ఖైరతాబాద్‌కు ఉపఎన్నిక వస్తుందని బీజేపీ చేసిన ప్రచారంతో ఇక్కడ ప్రతికూల ఫలితం వచ్చిందని టాక్. ఇక పట్నం సునితామహేందర్‌రెడ్డి మల్కాజిగిరి నుంచి కాకుండా చేవెళ్ల నుంచి పోటీ చేస్తే పార్టీ విజయం గెలిచే అవకాశం ఉండేదని భావిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల రెండూ చోట్ల ఓడిపోయామని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఇక మెదక్ విషయంలో బీఎస్పీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నీలం మధుకు టికెట్ ఇచ్చారు.






