ఈదుల చెరువులో ఇళ్ల స్థలాలు!
- కబ్జాకోరల్లో చిక్కుకున్న చెరువు
ప్రజాప్రతినిధులు, అధికారుల ‘సహకారం’
పెద్దఅంబర్‌పేట మున్సిపల్ పరిధిలో బాగోతం
చెరువును రక్షించాలని స్థానికుల విన్నపం
అబ్దుల్లాపూర్‌మెట్, జూన్ 5(విజయక్రాంతి) : హైదరాబాద్ శివారుల్లో రియల్ ఎస్టేట్‌కు కొదువ లేదు. ఖాళీ స్థలం కనిపిస్తే మట్టిపోయడం, రాళ్లు పాతడం, ప్లాటుగా చేయడం, అమ్మేయడం.. కబ్జాదారులకు సర్వసాధారణం. ప్రభుత్వం చెరువులను కాపాడాలని శతవిధాలా ప్రయత్నిస్తుంటే స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను మచ్చిక చేసుకుని అక్రమార్కులు కబ్జాలకు తెగబడుతున్నారు. తాజాగా పెద్దఅంబర్‌పేటలోని ఈదుల చెరువు కబ్జాకోరల్లో చిక్కు కున్నది.
రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట మున్సిపల్ పరిధిలోని ఈదుల చెరువును కబ్జా దారులు ఆక్రమించారు. మున్సిపల్ పరిధిలో భూములకు భారీగా ధరలు రావ డంతో చెరువు పరిసర ప్రాంతాల్లో ప్రైవేట్ వెంచర్లు వెలిశాయి. ఆ వెంచర్ల వెళ్లడానికి రోడ్డు సౌకర్యం లేదు. దీంతో ఓ ప్రైవేట్ వెంచర్ వాళ్ల చెరువు శిఖం భూమిని కబ్జా చేసి.. దర్జాగా దాదాపు 60 ఫీట్ల రోడ్డు వేస్తున్నారు. రాత్రి వేళలో భారీ పైపులు వేసి, కల్వర్ట్‌పైన రోడ్డును నిర్మించడానికి ఏర్పాటు చేస్తున్నారు.
ప్రజాప్రతినిధుల, అధికారుల అండ
దండలతో.. కబ్జాదారులు రెచ్చిపోతున్నట్లు సమాచారం. ఈదుల చెరువు ఎఫ్‌టీఎల్‌లో నుంచి రోడ్డు వేస్తుంటే చూసీచూడన్నట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ కార్యాలయం సమీపం లోనే ఈదుల చెరువు ఉంటుంది. నిత్యం ప్రజలు, ప్రజాప్రతినిధులు చెరువు వెంబడి రాకపోకలు సాగిస్తున్నా.. కబ్జాను ఆపలేకపోతున్నారు. అధికారులు ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చారు. అయినా.. వెంచర్ నిర్వాహకులు రోడ్డు నిర్మాణా పనులను ఆపడం లేదు. నోటీసులు ఇచ్చిన తర్వాత పనుల్లో మరింత ముమ్మరం చేస్తున్నారు. కబ్జాను అడ్డుకోవాల్సిన అధికారులు కండ్లు మూసుకుని, చూసి చూడనట్లు వ్యహరిస్తున్నారు. స్థానికులు ఫిర్యాదు చేసిన అధికా రులు స్పందించడం లేదు.
కంచె చేను మేసే విధంగా సొసైటీ పెద్దలు
ఈదులచెరువును కాపాడాల్సిన మత్య్సకారులే అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారు. సొసైటీ పేరుతో అనుమతులు తీసుకుని అక్రమార్కులకు విక్రయిస్తున్నారు. చెరువులు కాపాడాల్సిన మత్స్య సొసైటీ సం ఘాలు నేతలు కంచె చేను మేసే విధంగా వ్యవహరిస్తున్నారు. సొసైటీ సభ్యులందరూ ప్రైవేట్ వెంచర్ యాజమాన్యంతో కుమ్మకై... వాళ్ల ఇచ్చిన తాయీలాలకు తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటివరకు లక్షల రూపాయలు చేతులు మారినట్లు బహిరంగంగా మాటలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ అధికారుల సహకారంతో చెరు వు అక్రమణ పనులు వేగంగా జరుగుతన్నాయి.
చెరువులను కాపాడుతాం..
మాకు సమాచారం అందిన వెంటనే చెరువు ఎఫ్‌టీఎల్‌లో నిర్మించిన రోడ్డు నిర్మాణ పనులను ఆపివేశాం. రోడ్డు వేస్తున్నవారికి నోటీసులు ఇచ్చాం. పెద్ద అంబర్‌పేట మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడి రోడ్డు పనులను అడ్డుకున్నాము. రోడ్డు నిర్మాణానికి భారీ సైజులో ఉన్న పైపులు వేశారు.. వాటిని తొలిగించడానికి భారీ క్రేన్లు అవసరం. క్రేన్లు తెప్పించి, పైపులను తొలిగిస్తాం. చెరువును అక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
-తస్ఫీన్జ్రా, ఇరిగేషన్ ఏఈ, పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ






