16 July, 2026 | 11:05 PM

ఒక్కొక్కరు ఒక్కో రకం

06-06-2024 01:50 AM
  • సూర్యాపేట వైద్యారోగ్య శాఖ తీరు అధ్వానం

అక్రమాలు, అవినీతితో అస్తవ్యస్తం

లైంగిక వేధింపులు, విధుల్లో నిర్లక్ష్యం  

వైద్య సేవలు అందక ప్రజల్లో ఆగ్రహం

సూర్యాపేట, జూన్ 5 (విజయక్రాంతి) : ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా సూర్యాపేట వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు ఒక్కొక్కరు ఒక్కో రకంగా వ్యహరించడంతో ప్రజల్లో పలుచనవుతున్నారు. అక్రమాలు, అవినీతి, లైంగిక వేధింపులు, విధుల పట్ల నిర్లక్ష్యంతో ఆ శాఖను పూర్తిగా భ్రష్టు పట్టించారు.  ఇటీవల ఓ మహిళా డాక్టర్ తనను ఫుడ్‌సేఫ్టీ విభాగంలో పని చేస్తున్న అధికారి కల్యాణ్‌చక్రవర్తి లైగింకంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జిల్లా కలకలం రేపింది. అయితే,  ఈ విషయాన్ని అధికారులు రహస్యంగా పెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది.

చివరకు తాజాగా విచారణ కమిటీ వేయడం గమనార్హం. ఇదిలా ఉండగా, డీఎంహెచ్‌వో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.  వక్రమార్గంలో డెప్యూటేషన్ పొం దడమే కాకుండా విధులకు డుమ్మా కొడు తూ ఫోర్జరీ సంతకాలు చేయించి, రూ.13లక్షలు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైనట్లు తెలుస్తోంది. మరోపక్క కొందరు రాజకీయ నాయకుల అండతో ఉద్యోగం పేరిట అమాయకుల నుంచి లక్ష రూపాయల చొప్పున వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.   

విధుల పట్ల నిర్లక్ష్యం

ఒకపక్క అవినీతి, అక్రమాలు చోటుచేసుకుంటే మరోపక్క పీహెచ్‌సీలో పనిచేసే డాక్టర్లు సక్రమంగా విధులుకు హాజరుకావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా అధికారులు, కలెక్టర్ అడపాదడపా తనిఖీలు నిర్వహించగా, కాసర్లపహడ్, పెంచికల్‌దిన్నే, గరిడేపల్లి, హుజుర్‌నగర్, మునగాల, మఠంపల్లి డాక్టర్లు సకాలంలో విధులకు హాజ రుకాలేదని తేలింది. వారికి మెమోలు జారీ చేసినట్లు సమాచారం.   ఇదీ సూర్యాపేట వైద్యారోగ్య శాఖ తీరు. ఎప్పటికి మారుతుందో మరి..! కాగా, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ కల్యాణ్ చక్రవర్తిని మూడు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు.