సైన్యంపై కాంగ్రెస్ శీతకన్ను

29-04-2024 01:28:11 AM

ఆర్మీకి సరైన సహకారం అందించలేదు

కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలకు లెక్కలేదు 

మోదీ పాలనలో ఎన్నో మార్పులు వచ్చాయి

రాజస్థాన్ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్

హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉన్న సమయంలో సైన్యానికి ప్రభుత్వం నుంచి సరైన సహకారమే లభించలేదని, 2004 మధ్య కనీస మౌలిక సదుపాయాలు కూడా అందలేదని రాజస్థాన్ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఆరోపించారు. సైన్యానికి నైతిక మద్దతు ఇవ్వాలనే ఆలోచనే కాంగ్రెస్‌కు ఉండేది కాదని, ఆ ఆసక్తే వారిలో కనిపించేదని కాదన్నారు. హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన వికసిత్ భారత్ అంబాసిడర్ల కార్యక్రమా నికి కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగి స్తూ.. ఒకప్పుడు ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆయుధాల దిగుమతిదారు నుంచి ఇప్పుడు 80 దేశాలకు ఆయుధాలను ఎగుమతి చేసే స్థాయికి మన దేశం చేరుకునేలా మోదీ సర్కారు ఘనత సాధించిందన్నారు. ఊహించని విధంగా ఉద్యోగాల కల్పన సాధ్యమైందని, విదేశాల నుంచి భారీ పెట్టుబ డులను మనం ఆకర్షిస్తున్నామని తెలిపారు. 

పదేళ్లలో 7 ఐఐటీలు, 7 ఐఐఎంలు...

పదేళ్లలో దేశంలో 7 ఐఐటీలు, 7 ఐఐఎంలు, 15 ఎయిమ్స్, 315 మెడికల్ కళాశాలలు, 390 విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసిన ఘనత బీజేపీ సర్కారుకు దక్కుతుందని రాథోడ్ తెలిపారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 5జీ ఏర్పాటు చేసి వేగవంతమైన ఇంటర్నెట్ అందిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా అత్యుత్తమ జాతీయ రహదారుల నిర్మాణం కొనసాగుతున్నదన్నారు. మౌలిక వసతుల కల్పన వల్లే దేశంలో ఊహించని విధంగా అభివృద్ధి సాధ్యమైందన్నారు. 200కుపైగా మొబైల్ తయారీ కంపెనీలు ఇక్కడ సెల్ ఫోన్‌లను తయారు చేస్తున్నాయని తెలిపారు. చిప్ తయారీ కంపెనీలు కూడా వస్తున్నాయన్నారు. రాబోయే 25 ఏళ్లలో ఊహించని అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

ఏటా చేసిన అభివృద్ధిపై మోదీ సర్కారు ప్రొగ్రెస్ రిపోర్ట్ విడుదల చేస్తున్నదని, పారదర్శకతకు ఇది నిదర్శనమన్నారు. 2014 తర్వాత సైన్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చానని, సాధారణ వ్యక్తినైన తాను రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదన్నారు. ఓ సామాన్యుడికి సైతం రాజకీయంగా అవకాశాలు వస్తాయనేందుకు బీజేపీ పార్టీ నిదర్శనంగా నిలుస్తోందన్నారు. స్వాతంత్య్రం ఏర్పడిన తర్వాత 70 ఏళ్లుగా దేశాన్ని పాలించిన కుటుంబ పాలనలో కుంభకోణాలు, లీకేజీలకు స్వర్గధామంగా ఉండేదని, మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లీకేజీలకు అవకాశమే లేకుండా పోయిందన్నారు. కుంభకోణాలకు నిలయంగా మారిన వ్యవస్థను మార్చడం అంత సులభం కాదని, కానీ మోదీ పాలనలో దేశం బాగుపడిందన్నారు. 

ఉగ్రదాడులు ఉండవు..

కశ్మీర్‌లో నిత్యం సైనికులపై రాళ్లు విసరడం, ఉగ్రవాదుల దాడులు ఉండేవని.. అక్కడ ఆర్టికల్ 370 ఎత్తివేతతో వాటికి మోదీ ప్రభుత్వం చరమగీతం పాడిందని రాజ్యవర్ధన్ తెలిపారు. ఇంతకంటే దేశంలో గొప్ప పురోగతి ఏమంటుందన్నారు. 500 ఏళ్ల నుంచి సాధ్యం కాని రామమందిర నిర్మాణం ఒక్క చుక్క రక్తం కూడా చిందకుండా సాధ్యమైందన్నారు. ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న వేళ భారతీయ జెండాతో బస్సులు ధైర్యంగా ముందుకు కదులుతున్నాయంటే అంతర్జాతీయంగా మన స్థాయి ఎంత పెరిగిందో ఊహించవచ్చన్నారు. ఇన్ని గొప్ప కార్యక్రమాలు జరిగినా ఇప్పటి వరకు చేసిందంతా ట్రైలర్ మాత్రమేనని అసలు సినిమా ముందుందని ప్రధాని మోదీ అంటున్నారంటే మన దేశ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఊహించుకోవచ్చన్నారు. సబ్ కా సాథ్ సబ్‌కా వికాస్ అనే నినాదంతో పదేళ్లలో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ఆయన దేశం కోసం పనిచేస్తున్నారని తెలిపారు. నమో యాప్ ద్వారా కోట్లాది మంది వికసిత్ భారత్ కోసం పనిచేస్తున్నారని అన్నారు. సికింద్రాబాద్ నుంచి కిషన్‌రెడ్డి ఘన విజయం సాధించేలా చూడాలని కోరారు.

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా...


స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉందని, ఇప్పుడు మనం ఆ దశ నుంచి ముందుకు సాగేందుకు బాటలు వేస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. స్వాతంత్య్రం నాటి నుంచి ఓ లక్ష్యం లేని దిశగా కాంగ్రెస్ పాలన సాగిందన్నారు. దేశం అన్ని రంగాల్లో అభివృది చెందేందుకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తూనే ఉందన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్‌తో అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేయడమే లక్ష్యంగా మోదీ ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యధిక యువత జనాభా ఉన్న మన దేశంలో వారి ద్వారా దేశాన్ని మరింత పురోగతి దిశగా తీసుకుపోవడంతో పాటు వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను స్థానికంగానే అందించాలనే ప్రయత్నం చేస్తున్న ఘనత ప్రధాని మోదీకి దక్కతుందన్నారు.