కేసీఆర్‌ది పవర్ ఫీవర్

29-04-2024 01:26:34 AM

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి 

హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ అబద్ధాల ప్రొఫెసర్ అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. పాలమూరు పర్యటనలో భాగంగా మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నివాసంలో కేసీఆర్ భోజనం చేస్తున్న ప్పుడు మూడు సార్లు కరెంట్ పోయిందనడంలో వాస్తవం లేదని, ప్రజలు కూడా నమ్మరని ఆయన చెప్పారు. కేసీఆర్ బాధంతా కరెంట్ గురించి కాదని, ఆయనకు పొలిటికల్ పవర్ పోయిందనే ఫికర్ పట్టుకున్నదని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. గాంధీభవన్‌లో ఆదివారం మాట్లాడుతూ.. ఏదైనా సమస్య ఉంటే ఒక సారి ట్రిప్ అవ్వడం సహజమన్నారు. “రాష్ట్రం ఎప్పుడు విడిపోతే అప్పుడు సీఎం కావాలని కేసీఆర్ అనుకునే వాడు.  అబద్ధాలను నిజాలుగా చెప్పడంలో కేసీఆర్ దిట్ట.

కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రజలు గుర్తుకు రాలేదు. ప్రతిపక్షంలోకి వచ్చాక ప్రజలు గుర్తుకు వచ్చారు. కేసీఆర్ కుటుంబానికి ప్రజలు పొలిటికల్ పవర్ కట్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలవకపోతే పార్టీ మనుగడే కష్టమనే భావనతో ఉన్నారు. పదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు లేని ఎక్స్ ప్రతిపక్షంలోకి రాగానే కేసీఆర్‌కు ఖాతా వచ్చింది” అని జగ్గారెడ్డి దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఓట్లు వేయడం వల్ల లాభం లేదని, ఒకటి, రెండు సీట్లు గెలిచినా బీజేపీకి కేసీఆర్ తాకట్టు పెడుతారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీని కనీసం 14 సీట్లలో గెలిపిస్తే.. రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావడానికి మరింత మద్దతు లభిస్తుందన్నారు.