10 August, 2026 | 10:13 PM

దళితులు, బహుజనుల సంక్షేమం, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ నిరంతరం కృషి

10-08-2026 09:10 PM

- జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం విస్తృత సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ విభాగం చైర్మన్ సత్య నారాయణ

ఆదిలాబాద్,(విజయక్రాంతి): దళితులు, బహుజనుల సంక్షేమం, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ విభాగం చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి  సత్య నారాయణ అన్నారు. సోమ వారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ ఫంక్షన్ హాల్‌ లో జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ కాంగ్రెస్ ఎస్సీ విభాగం నేషనల్ కోఆర్డినేటర్ సిద్ధార్థ హితంబ్రే, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, డీసీసీ డాక్టర్ నరేష్ జాదవ్ లతో కలిసి ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా వేగంగా ముందుకు సాగుతోందని అన్నారు. జాతీయ నాయకత్వం దళిత విభాగంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, జాతీయ స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ఎస్సీ విభాగాన్ని పునర్నిర్మించి మరింత బలోపేతం చేస్తోందని తెలిపారు. దళితుల హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. దళితులందరూ ఐక్యంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే బీజేపీకి గెలిచే అవకాశమే ఉండదన్నారు.

కాంగ్రెస్ ఎస్సీ విభాగం నాయకులు దళితులను కాంగ్రెస్ పార్టీ వైపు చైతన్యపరిచే విధంగా గ్రామస్థాయి నుంచి విస్తృతంగా పనిచేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో దళిత కుటుంబాలను కలుసుకుని కాంగ్రెస్ పార్టీ విధానాలను, సామాజిక న్యాయం కోసం పార్టీ చేస్తున్న కృషిని వివరించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో దళితుల జనాభా 20 శాతానికి పైగా ఉందని, రాబోయే ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించేలా ఎస్సీ విభాగం నాయకులు సమన్వయంతో పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఎస్సీ విభాగాన్ని మరింత బలోపేతం చేసి, పార్టీ విజయానికి దళిత ఓటర్లను సమీకరించడంలో కీలక పాత్ర పోషించాలని అన్నారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు, మైనారిటీలపై దాడులు పెరిగాయని ఆయన ఆరోపించారు. రాజ్యాంగ హక్కులు, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు దళితులు, మైనారిటీలు, గిరిజనులు ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజాస్వామ్య, సామాజిక న్యాయ విలువలకు కట్టుబడి ఉన్న కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలని తెలిపారు. మహాత్మా గాంధీ ఆశయాలు, అంబేద్కర్ ఆలోచనలు, సామాజిక సమానత్వం వంటి విలువలను ముందుకు తీసుకెళ్లడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందని, గత ప్రభుత్వా పాలనలో అర్హులైన  పేద కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వకపోవడం ముఖ్యంగా దళితులు, బహుజన వర్గాలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు లు ఇచ్చిందని,రేషన్ కార్డు ల ద్వారా ఉచిత సన్న బియ్యం పంపిణి, మహిళలకు ఫ్రీ బస్, చేయూత పెన్షన్ లు, అర్హులైన ప్రతి పేద వారికి ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నమాని పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. అంతకు ముందు కలెక్టర్ చౌరస్తాలోని కొమరం భీం విగ్రహానికి, అంబేద్కర్ చౌరస్తాలో బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, బోథ్ నియోజకవర్గం ఇంచార్జి ఆడే గజేందర్, మాజీ డీసీసీ సాజిద్ ఖాన్, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవ రెడ్డి, ఆసిఫాబాద్ ఇంచార్జి శ్యామ్ నాయక్, అదిలాబాద్ ఎస్సి డిపార్ట్మెంట్ పార్లమెంట్ కోఆర్డినేటర్ సమతా సుదర్శన్, బోథ్ మార్కెట్ చైర్మన్ మల్లెపూల సత్య నారాయణ, ఇచ్చోడా మార్కెట్ చైర్మన్ కుంరం సత్యవతి కోటేష్, జైనథ్ మార్కెట్ చైర్మన్ అశోక్ రెడ్డి, ఆత్మ డైరెక్టర్ లు కౌడాలా నారాయణ, గిమ్మ సంతోష్ రావు, సేవా దళ్ అధ్యక్షులు మోతి రామ్, మైనారిటీ అధ్యక్షులు షాహిద్ అలీ, ఓబీసీ సెల్ అధ్యక్షులు అంబకంటి అశోక్, సెద్మకి ఆనంద్ రావు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గిమ్మ దీపక్, చంద్రయ్య, బ్రీజులాల్, బొల్లారం బాబన్న, జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ లు మల్యాల కరుణాకర్, అక్తర్ అలీ, దేవిదాస్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి పసుల చంటి, జిల్లా కాంగ్రెస్ మీడియా కోఆర్డినేటర్ మేకల జితేందర్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.