లోక్‌సభ ఫలితంపై కాంగ్రెస్ ఫోకస్
- సీట్లు తగ్గటంపై త్వరలో ఖర్గే సమీక్ష
వారంపది రోజుల్లో ఢిల్లీ పెద్దల భేటీ
హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో తక్కువ సీట్లు రావడంతో కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణపై సీరియస్‌గా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రం నుంచి 14 ఎంపీ సీట్లను టార్గెట్‌గా పెట్టుకుంటే 8 సీట్లకే పరిమితం కావడంపై ఢిల్లీ పెద్దలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఏమాత్రం పట్టులేని బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఎలా దక్కాయన్నదానిపై ఆలోచన చేస్తున్నారు. అయితే కాంగ్రెస్‌కు ఎంపీ సీట్లు ఎందుకు తగ్గాయనే అంశంపై వారం పది రోజుల్లో ఏఐసీసీ నేతలు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్టు సమాచారం. కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్యలో ఎంపీలు గెలుస్తారని, కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని భావించింది.
అయితే అందకు భిన్నంగా ఫలితాలు రావడంతో ఓటమికి గల కారణాలు, సీట్లు తగ్గడానికి బాధ్యులెవరనే అంశంపై సూక్ష్మ స్థాయిలో పరిశీలన చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి చూస్తే.. పార్లమెంట్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశించిన కాంగ్రెస్‌కు ప్రతికూల ఫలితాలు వచ్చాయని అధిష్ఠానం భావిస్తోందని చెప్తున్నారు. ఐదు నెలల వ్యవధిలోనే ఇలాంటి ఫలితాలు రావడంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
అత్యధిక స్థానాలు గెలవాల్సిన తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాలను ఖర్గే ప్రస్తావించారు. ఈ మూడు రాష్ట్రాలపై విడిగా సమీక్ష నిర్వహిస్తామని అప్పుడే ప్రకటించారు. అందుకు అనుగుణంగానే కర్ణాటక ఫలితాలను మల్లిఖార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ సమీక్షించారని తెలిసింది. అదే తరహాలో తెలంగాణలోనూ పార్టీ నాయకులతో వారం పది రోజుల్లో సమీక్ష ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ శాతం పెరిగిందని చెప్తున్నారు. బీజేపీకి బీఆర్‌ఎస్ ఓట్లు బదిలీ కావడంతోనే కాంగ్రెస్‌కు నష్టం జరిగిందని, లేకుంటే 12 నుంచి 14 సీట్లు గెలిచేవారమని సీఎం కూడా చెప్పారు.






