30 May, 2026 | 9:18 PM

Breaking News

నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు: సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావు   •   ట్యాబ్ ఎంట్రీ త్వరితగతిన పూర్తి చేయాలి   •   ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణ రాష్ట్రానికి మొదటి స్థానం   •   సత్యనారాయణపురం గ్రామంలో భూ సమస్యలపై సమావేశం   •   పంచాయతీ కార్యదర్శిపై చేయి చేసుకున్న సీనియర్ అసిస్టెంట్   •   ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ హల్‌చల్   •   కమనీయం.. రమనీయంగా వనదుర్గమ్మ పల్లకి సేవ   •   చెరువులో పడి మృతి చెందిన శంకర్ మృతదేహం వెలికి తీత   •   జూన్ 3న వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయు జిల్లా మహాసభను విజయవంతం చేయాలి   •   ప్రభుత్వ జూనియర్ కళాశాల కోసం విద్యార్థుల ఎదురుచూపులు   •  

రైతుల బావుల వద్ద విద్యుత్ మీటర్లు పెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్ర.. మీటర్ల ఏర్పాటును తిప్పికొడదాం

30-05-2026 08:40 PM

 ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి & మాజీ శాసనసభ్యులు జాజాల సురేందర్ గారి ఆధ్వర్యంలో నేడు ఎల్లారెడ్డి లో జరిగిన బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, SIR మరియు నాయకుల, కార్యకర్తల విస్తృత స్థాయి సన్నాహక సమావేశానికి హాజరైన మాజీ మంత్రి, బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి ఈ సందర్బంగా మాట్లాడుతూ... మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం మారిన నాటి నుండి రాష్ట్రంలో రాక్షస పాలన మొదలైందని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. "పచ్చగా ఉన్న తెలంగాణ ఇవాళ రేవంత్ రెడ్డి పాలనలో నాశనమైపోతుందన్నారు.

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు 24 గంటల ఉచిత, నాణ్యమైన కరెంట్ అందింది. కానీ ఇవాళ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే కరెంట్ వస్తుంది . నాడు కరెంట్ పోతే వార్త.. నేడు కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని దారుణ పరిస్థితి నెలకొంది" అని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలు ఒకటైపోయాయని, నరేంద్ర మోదీ చెప్పినట్లు రేవంత్ రెడ్డి నడుచుకుంటున్నారని శ్రీ వేముల ఆరోపించారు.

"నాడు కేసీఆర్  అధికారంలో ఉన్నప్పుడు రైతుల బావుల వద్ద ఉచిత కరెంట్‌ను నియంత్రిస్తూ మీటర్లు పెట్టాలని నరేంద్ర మోదీ ఒత్తిడి తెచ్చారు. మీటర్లు పెడితే సంవత్సరానికి రూ. 5 వేల కోట్ల చొప్పున, 6 సంవత్సరాలకు గానూ రూ. 30 వేల కోట్ల నిధులు ఇస్తామని ఆశ చూపారు. కానీ కేసీఆర్ రైతుల ప్రయోజనాల కోసం ఆ రూ. 30 వేల కోట్లను సైతం తృణప్రాయంగా వదులుకున్నారు తప్ప, కరెంట్ మీటర్లు పెట్టేందుకు ససేమిరా ఒప్పుకోలేదు" అని స్పష్టం చేశారు. కానీ నేడు అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి, మోదీ చెప్పిన మీటర్ల నిబంధనకు తలొగ్గి రైతుల పొలాల వద్ద మీటర్లు పెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారని మండిపడ్డారు.

ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ERC) సమావేశంలో విద్యుత్ శాఖా అధికారి శశాంక్. 'లెక్కల కోసం, ఎంత విద్యుత్ సరఫరా అవుతుందో తెలుసుకోవడానికే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లకు మీటర్లు పెడుతున్నాం' అని చెప్పడాన్ని తప్పుపట్టారు. "కరెంట్ ఉచితంగా ఇచ్చేటప్పుడు నీకు లెక్కలు ఎందుకు? మొదట ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద మీటర్లు పెడతారు.. ఆ తర్వాత మెల్లగా మన బావుల కాడికి వచ్చి మీటర్లు పెడతారు. ఇదంతా రైతులపై భారం వేయడానికే" అని హెచ్చరించారు.

రైతుల బావుల వద్ద కరెంట్ మీటర్లు పెట్టాలనే కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల కుట్రలను రైతాంగం అంతా ఏకమై తిప్పికొట్టాలని ఎల్లారెడ్డి నియోజకవర్గ రైతాంగం తరఫున ఈ సమావేశం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద గానీ, బావుల వద్ద గానీ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు ప్రయత్నిస్తే బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. రైతుల గోస పోసుకునే ఏ చర్యను కూడా ఊరుకునేది లేదు అని హేచ్చరించారు.

గతంలో రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ‘రైతులకు మూడు గంటల కరెంట్ చాలు’ అని అమెరికాలో మాట్లాడితే, నిన్నటి డిస్కామ్ మీటింగ్ లో కూడా కాంగ్రెస్ కిసాన్ మోర్చా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కూడా రెగ్యులేటరీ కమిషన్ ముందు రైతులకు మూడు గంటల కరెంట్ చాలని, చివరి మడి దాకా నీళ్లు పోతాయని, ఇప్పటివరకు వ్యవసాయం అట్లే నడిచిందని చెప్పడం సిగ్గుచేటు. మూడు గంటల కరెంట్ తో నీ పొలం పారించి చుపిస్తావా రెవంత్ రెడ్డి అని ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. ఉచిత కరెంట్ ను ఎగ్గొట్టేందుకే నరేంద్ర మోదీ చెప్పినట్లు రేవంత్ రెడ్డి నడుచుకుంటున్నారని మండిపడ్డారు.

జొన్నలు కొనమని రైతులు మొత్తుకుంటే.. నిన్న మొన్న కాంటాలు పెట్టి, ఎకరానికి కేవలం 10 క్వింటాళ్ళు మాత్రమే కొంటామని చెప్తున్నారు. ఒక ఎకరానికి 30 క్వింటాళ్ల జొన్నలు పండితే, మీరు కేవలం 10 క్వింటాళ్లే కొంటే మిగతా 20 క్వింటాళ్లు రైతులు ఎక్కడ పోసుకోవాలి? నేను జొన్న రైతులందరికీ పిలుపునిస్తున్నా.. ప్రభుత్వం మీ పంట మొత్తం కొనకపోతే, మిగిలిన జొన్న బస్తాలన్నింటినీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇళ్లకు తీసుకెళ్లి వారి ఇళ్లలోనే కుమ్మరించండి.

కేసీఆర్  ప్రభుత్వంలో పెసర్లు, కందులు, జొన్నలు, వడ్లు రైతులు ఎంత పండిస్తే అంత మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేశాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులు పండించిన ప్రతి గింజా కొనాలని డిమాండ్ చేస్తున్నాం.. లేకపోతే మీ ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. ఆరు నెలల ముందే అన్ సీజన్ లో దేశంలో ఎక్కడ యూరియా అందుబాటులో ఉంటే అక్కడ నుండి రైళ్ల ద్వారా తెప్పించి గోదాముల్లో నిల్వ ఉంచేవారు . కేవలం ఒక ఫోన్ కొడితే చాలు సొసైటీల నుంచో, షాపుల నుంచో ఆటోల్లో యూరియా బస్తాలు నేరుగా రైతుల బావుల వద్దకు వచ్చేవి.

నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఒక యాప్ (App) తీసుకువచ్చి రైతులను ఇబ్బందుల పాలు చేస్తోంది. రైతులకు యాప్‌లు వాడటం వస్తుందా? యూరియా కావాలంటే మీసేవ సెంటర్ల చుట్టూ, ఇతరుల చుట్టూ తిరగాల అన్నారు. ఐదెకరాల భూమి ఉన్న రైతుకు ఎకరానికి నాలుగు బస్తాల చొప్పున 20 బస్తాలు కావాలంటే, యాప్ ఒకేసారి ఇవ్వడం లేదు.అంటే 20 బస్తాల కోసం రైతు ఐదుసార్లు యాప్ చుట్టూ, ఐదుసార్లు షాపుల చుట్టూ తిరగాలా? అని నిలదీశారు.

తాము యూరియా ఇవ్వాలని కేంద్రాన్ని అడిగామని, కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇవ్వడం లేదని కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతులెత్తేశారు అని వేముల గుర్తు చేసారు.. నేను పొన్నం ప్రభాకర్ ను, సీఎం రేవంత్ రెడ్డిని అడుగుతున్నా.. కేంద్రం నుంచి యూరియా తెచ్చే చేతగానప్పుడు మీరు ఎందుకు ఆ కుర్చీల్లో కూర్చున్నారు? రైతన్నకు యూరియా ఇవ్వలేనప్పుడు వెంటనే ఆ పదవుల నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేంద్రం ఇవ్వకపోయినా, కిందమీద పడి పోరాడి రైతులకు యూరియా అందించారని గుర్తు చేశారు.

 "ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో 80 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని డబ్బా కొట్టుకుంటున్నారు. నేను నేరుగా మాల్తుమ్మెద గ్రామానికి వెళ్లి కల్లాల్లో ఉన్న రైతులని అడిగితే.. ఇప్పటివరకు కేవలం 34 లారీలు మాత్రమే ధాన్యం లోడ్ అయింది, ఇంకా 70 లారీల ధాన్యం కుప్పలు కల్లాల్లోనే ఉన్నాయి' అని చెప్పారు. కేవలం 30 శాతమే కొనుగోళ్లు జరిగాయి, ఇంకా 70 శాతం ధాన్యం రోడ్ల మీదనే ఉంది.రేవంత్ రెడ్డి.. నీకు ఛాలెంజ్ చేస్తున్నా..దమ్ముంటే నా వెంట రా, మాల్తుమ్మెదలో 70 శాతం ధాన్యం కుప్పలు ఇంకా ఎలా ఉన్నాయో కళ్లకు కట్టినట్లు చూపిస్తా. ఎవరిని మోసం చేయడానికి ఈ అబద్ధపు ప్రచారాలు?" అని నిలదీశారు.

అకాల వర్షాలకు ధాన్యం అంతా తడిసి, లాకెలై (మొలకలు వచ్చి) రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ తడిసిన ధాన్యాన్ని రైస్ మిల్లుల దగ్గరకు తీసుకెళ్తే.. మిల్లర్లు క్వింటాలుకు 12 కిలోల చొప్పున 'తరుగు' (తాలు) తీస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నారు. క్వింటాలుకు 12 కిలోలు అంటే ఒక్కో క్వింటాలుపై రైతుకు ₹300 నష్టం వస్తోంది. ఎకరాకు సగటున 30 క్వింటాళ్ల దిగుబడి చొప్పున లెక్కిస్తే.. ఒక్కో రైతుకు ఎకరాకు ఏకంగా ₹9,000 రూపాయల భారీ నష్టం వాటిల్లుతోంది. రేవంత్ రెడ్డి.. నీ నిర్లక్ష్యం వల్లే ఈ రోజు తెలంగాణ రైతు ఎకరాకు తొమ్మిది వేల రూపాయలు నష్టపోతున్నాడు.

"మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బీఆర్‌ఎస్ నాయకులకు పనిలేక లొల్లి చేస్తున్నారని మాట్లాడుతున్నారు. "కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల బాధలు పట్టవు. రేవంత్ రెడ్డికి హైదరాబాద్‌లో ఏ భూమి కనిపిస్తే ఆ భూమి మీద పడటం, భూదందాలు చేయడం మాత్రమే తెలుసు. 'ఫ్యూచర్ సిటీ'పేరు మీద , 'మూసి పునరుజ్జీవనం' పేరు మీద లక్షల కోట్లు దోచికోవడం మీద ఉన్న శ్రద్ధ, కమిషన్ల మీద ఉన్న ఆశ రైతు మీద లేదు. కనీసం కల్లాల నుండి వడ్ల కుప్పలు లేపే శాతన (చేతకాని) కానోడు.. ఇవాళ పెద్ద పెద్ద ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నాడు.

మహిళలకు రూ. 2500 ఇస్తామన్నారు.. ఏమైంది ఆ ముచ్చట? తులం బంగారం ఇస్తామన్నారు.. అడ్రస్ లేదు. వృద్ధులకు రూ. 4000 పెన్షన్ పెంచుతామన్నారు.. అదీ లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలన్నారు.. ఊసే లేదు. ఇవన్నీ కేవలం కాంగ్రెస్ చెప్పిన పొంకులు, అబద్ధాలు మాత్రమే. ప్రజలకు ఇచ్చిన ఒక్కటంటే ఒక్క హామీని కూడా ఈ ప్రభుత్వం అమలు చేయలేదు. దీనిపై ఎవరైనా గట్టిగా నిలదీస్తే.. ప్రజాస్వామ్యబద్ధంగా సమాధానం చెప్పాల్సింది పోయి, ఎదురు తిరిగి మాట్లాడే వారిపై అక్రమ కేసులు పెడుతూ రౌడీయిజం చేస్తున్నారు.

రెండున్నరేళ్ల ఈ కాంగ్రెస్ పాలనలోనే ప్రజలు విసిగిపోయారు. ప్రపంచంలోనే ఇంత విఫలమైన, చేతకాని ముఖ్యమంత్రి ఎవరూ లేరు. ప్రజల నుంచి, విపక్షాల నుంచి ఇన్ని తిట్లు, ఇంత గలీజ్ తిట్లు తిన్న ముఖ్యమంత్రి దేశ చరిత్రలోనే మరొకరు ఉండరు. ఈ ముఖ్యమంత్రికి, ఆయన మంత్రులకు ప్రజా సంక్షేమంతో పనే లేదు. పొద్దున లేస్తే విపక్ష నేతలు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, వారి కుటుంబ సభ్యులను ఇష్టం వచ్చినట్లు తిట్టడం.. "పేగులు మెడలో వేసుకుంటా", "తోలు తీస్తా", "భూమిలో తొక్కుతా" అంటూ వీధి రౌడీల కంటే ఘోరంగా మాట్లాడటమే పనిగా పెట్టుకున్నారు.

గత కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి ఆంధ్రా నాయకులు తెలంగాణపై మళ్లీ కన్నేశారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బక్కి నరసింహులు అనే ఆయన అసలు 'డిక్షనరీలోనే తెలంగాణ అనే పదమే లేదు' అని మాట్లాడుతుంటే చంద్రబాబు వారించలేదు. రేవంత్ రెడ్డి ఇప్పటివరకు దాన్ని ఖండించలేదు. బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గానీ, బండి సంజయ్ గానీ నోరు మెదపలేదు. పవన్ కళ్యాణ్ ఏమో ఆంధ్రాలో కొబ్బరికాయలు ఎండిపోతుంటే 'తెలంగాణ వాళ్ల అసూయ వల్లే ఎండిపోతున్నాయి' అని పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడు. తెలంగాణ వస్తే 11 రోజులు అన్నం తినలేదట ఆయన. తెలంగాణ అస్తిత్వాన్ని, పచ్చటి రాష్ట్రాన్ని ధ్వంసం చేయడానికి వీరంతా ఒకటయ్యారు. వీరందరితో రేవంత్ రెడ్డి చేతులు కలిపి తెలంగాణను మళ్లీ పాత రోజుల్లోకి, అంధకారంలోకి నెట్టేస్తున్నారు.

పద్నాలుగేళ్లు కొట్లాడి, ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణను తెచ్చింది కేసీఆర్ . అందుకే మనకు ఈ నేల మీద ప్రేమ ఉంటుంది. తెలంగాణ నాశనమైపోతుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఏనాటికైనా తెలంగాణకు కేసీఆర్ గారే శ్రీరామరక్ష. కాబట్టి గులాబీ సైనికులారా.. గ్రామగ్రామాన కేసీఆర్ గారు చేసిన అద్భుతమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి. ఈ రాక్షసుడు రేవంత్ రెడ్డి చేస్తున్న గలీజ్ పనులను ఎండగట్టండి. ప్రతి గ్రామంలో విస్తృతంగా సభ్యత్వ నమోదు చేపట్టి పార్టీని బలోపేతం చేయాలి. మనమంతా కలిసికట్టుగా పోరాడి, మళ్లీ ఎల్లారెడ్డిలో సురేందర్ అన్నను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి, కేసీఆర్ గారిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకొని మన పచ్చటి తెలంగాణను మనం కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.