calender_icon.png 7 February, 2026 | 10:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైల్వే వంతెనను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తుంది

07-02-2026 08:50:32 PM

మోసపూరిత ప్రచారాన్ని యువత నమ్మవద్దు

మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు మామిళ్ల ముత్యాలు యాదవ్

ఘట్ కేసర్,(విజయక్రాంతి):  ఘట్ కేసర్ పట్టణంలో నిర్మిస్తున్న రైల్వే వంతెన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తుందని ఘట్ కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు మామిండ్ల ముత్యాలు యాదవ్ స్పష్టం చేశారు. ఘట్ కేసర్ లో శనివారం ఆయన మాట్లాడుతూ... గత కాంగ్రెస్ ప్రభుత్వం రైల్వే వంతెనను మంజూరు చేసి 2013లో శంకుస్థాపన చేసిందని ప్రారంభోత్సవం కూడా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుందన్నారు. రైల్వే వంతెన పనులు 80 శాతం పూర్తి అయ్యాయని మరో నాలుగైదు నెలల్లో పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కాంట్రాక్టర్ కు ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు.

వంతెన నిర్మాణంలో భాగంగా గురుకుల్ వైపు అన్ని పిల్లర్లు, స్లాబ్ ల పనులు పూర్తి చేశారని గేటుకు ఇవతల వైపు పిల్లర్ల నిర్మాణం పూర్తయిందని మరో మూడు స్లాబ్ లు వేసే పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. గత 13 సంవత్సరాలుగా నత్తనడకన సాగుతున్న వంతెన పనులు గడిచిన 2 సంవత్సరాలలో వేగవంతం చేయగా 80 శాతం వరకు పూర్తి చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్వోబీకి సంబంధించిన పెండింగ్ బిల్లులు రూ.2కోట్ల వరకు కాంట్రాక్టర్ కు ఇవ్వడం జరిగిదని, మున్సిపల్ ఎన్నికలు కాగానే పెండింగ్ లో ఉన్న మరో రూ. 4.18 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తుందని పేర్కొన్నారు.

ఒక వైపు వంతెన పనులు జరుగుతుండగా కొందరు రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం యువకులను రెచ్చగొట్టి ఆందోళనలను చేయాలని ప్రోత్సహించే పనులు చేస్తున్నారని ఈవిషయాన్ని యువత గమనించాలని ఆయన కోరారు. మాజీ ప్రజాప్రతినిధులు గత 15 ఏండ్లుగా పదవుల్లో కొనసాగారని కానీ నిజాయితీగా వంతెన పని పూర్తి చేయించకుండా అడ్డంకులు సృష్టించి ఇప్పుడు సోషల్ మీడియాలో తామే అంటూ గొప్పలు చెప్పుకోవడాన్ని ప్రజలు నమ్మరని, పని చేసి అభివృద్ధి చూపించే కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ఉంటారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వంతెన పూర్తి చేస్తుందని 13 ఏళ్లుగా గేటు అవతల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని మరో నాలుగైదు నెలలు ఓపికతో ఆగుతే సమస్య తీరుతుందని, దీనిపై యువత, మహిళలు ఆందోళన చెందకూడదని ముత్యాలుయాదవ్ కోరారు.