10-12-2025 02:15:42 AM
కాంగ్రెస్ మొదటి నుంచీ ‘వందేమాతర’ వ్యతిరేకి!
న్యూఢిల్లీ, డిసెంబర్ 9: బ్రిటిష్ సంస్కృతిని అనుసరించేవారికి వందేమాతర గీతం విలువ తెలియదని, వారు ఎప్పటికీ దేశ ప్రజలపై గీత ప్రభావాన్ని ఆపలేరని కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. బ్రిటిష్ పాలకులు కూడా ప్రజల్లో గీత ప్రభావాన్ని ఆపలేకపోయారని, ఇక కాంగ్రెస్ నేతలేం చేయగలరని నిప్పులు చెరిగారు. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వరకూ ప్రతిఒక్కరూ వందేమాతరం గీతాన్ని వ్యతిరేకిస్తూనే వస్తున్నారని దుయ్యబట్టారు.
వందేమాతర గీతం 150వ ఉత్సవాల సందర్భంగా పార్లమెంట్‌లో రెండోరోజు మంగళ వారమూ చర్చ కొనసాగింది. రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ చర్చ ప్రారంభిస్తూ.. ముస్లింలీగ్ సంతృప్తిప రిచేందుకే కాంగ్రెస్ పార్టీ ‘వందేమాతర’ గీతాన్ని కేవలం రెండు చరణాలకు పరిమితం చేసిందని, ఆ పనిచేయకపోతే దేశ విభజన జరిగేది కాదని అభిప్రాయపడ్డారు.
గీతానికి 50 ఏళ్లు పూర్తయిన కాలంలో దేశం బ్రిటీష్ పాలకుల ఏలుబడిలో ఉండేదని, 100 ఏళ్లు పూర్తయిన సమయంలో దేశం ఎమర్జెన్సీలో చీకటి రోజుల్లో మగ్గిపోయిందని గుర్తుచేశారు. వందేమాతరం నినాదమిచ్చిన వారిని నాటి ప్రధాని ఇందిరా గాంధీ జైళ్ల పాలు చేశారని మండిపడ్డారు.
భారత ప్రజల స్ఫూర్తి ‘గీతం’
దేశకాల, మాన పరిస్థితులతో ప్రమేయం లేకుండా వందేమాతర భారత ప్రజల్లో ఎప్పటికీ స్ఫూర్తి నింపుతూనే ఉంటుందని కొనియాడారు. గీతం జాతీయవాదాన్ని, స్వాతంత్య్ర సమరయోధులను ప్రభావితం చేసిందని, స్వాతంత్య్ర పోరాటానికి శక్తినిచ్చిందని పేర్కొన్నారు. ‘సరిహద్దుల్లో సైనికుడు లేదా శాంతిభద్రతలను కాపాడే పోలీసులు తమ జీవితాన్ని త్యాగం చేసేటప్పుడు పలికే నినాదం వందేమాతరమే’ అని అమిత్‌షా ఉద్ఘాటించారు.
పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందునే, కేంద్ర ప్రభుత్వం వందేమాతరంపై రాద్ధాంతం చేస్తోందని సోమవారం కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ చేసిన ఆరోపణలపై అమిత్‌షా అభ్యంతరం వ్యక్తం చేశారు. వందేమాతరం గీత రచయిత బంకిం చంద్ర చటర్జీ బెంగాల్‌కు చెందిన వ్యక్తి అయినప్పటికీ, ఆయన రాసిన గీతం బెంగాల్‌కే పరిమితమైంది కాదని అమిత్‌షా వ్యాఖ్యానించారు.
గీతాన్ని భుజానికెత్తుకున్నదే మేం!
న్యూఢిల్లీ, డిసెంబర్ 9: ‘వందేమాతర’ గీతం మొదటి రెండు చరణాలను మాత్రమే పాడాలనే నిర్ణయం జవహర్‌లాల్ నెహ్రూజీ ఒక్కరు తీసుకున్న నిర్ణయం కాదని, గీతంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం జరిగిన సమయంలో మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, మదన్ మోహన్ మాలవ్యా వంటి మహామహులు ఉన్నారని కేంద్ర మంత్రి అమిత్‌షాకు రాజ్యసభ వేదికగా కాంగ్రెస్ సభ్యుడు మల్లికార్జున ఖర్గే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా గీతాన్ని తొలి రెండు చరణాలకు సరైందేనని అంగీకరించారని తెలిపారు. ‘వందేమాతరం’ గీతాన్ని నెహ్రూ రెండు చరణాలకు కుదించారని కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకత్వం మొదటి నుంచి వందేమాతర గీతాన్ని ప్రేమిస్తున్నదని, తమ పార్టీ ఏ సభ నిర్వహించినా, ఏ సమావేశం నిర్వహించినా వందేమాతర గీతాన్ని ఆలపించిందని గుర్తుచేశారు.
చరిత్రంలో ఎప్పుడూ వందేమాతరం ఆలపించని వారు కూడా ఇప్పుడు ఆలపిస్తున్నారని ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నేతలనుద్దేశించి నిప్పులు చెరిగారు. స్వాతంత్రోద్యమంలో భాగంగా 1921లో దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమం జరిగిందని, నాడు వందేమాతరాన్ని నినదిస్తూ జైళ్లకు వెళ్లారని గుర్తుచేశారు. ‘మీరు అప్పుడు ఏం చేశారు? ఆ సమయంలో బ్రిటిష్ వారి తొత్తులుగా ఉన్నారు. దేశ భక్తి పాఠాలు మీరు మాకు నేర్పుతారా? నెహ్రూను అవమానించేందుకు ప్రతిసారీ మోదీ ప్రయత్నిస్తున్నారు’ అని మండిపడ్డారు.