calender_icon.png 10 December, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధిక సుంకం.. ఇక బియ్యం వంతు?

10-12-2025 01:37:43 AM

భారత్‌కు మరోషాక్ ఇవ్వనున్న ట్రంప్

కెనడియన్ ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తులపైనా నిర్ణయం

వాషింగ్టన్, డిసెంబర్ 9: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే భారత్‌పై 50శాతం సుంకాలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ట్రంప్ మరోసారి భారత్‌కు షాక్ ఇవ్వనున్నారు. సుంకాల విధింపుపై మరో నిర్ణయం తీసుకోనున్నారు. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న బియ్యంపై అధిక సుంకాలు విధించే యోచనలో ఉన్నారు. వాషింగ్టన్‌లోని శ్వేతసౌధంలో తాజాగా ఆయన అక్కడి రైతులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

వారి నుంచి వినతులు స్వీకరించి అనంతరం మీడియాతో మాట్లాడారు. భారత్ నుంచి దిగుమతి చేసుకునే బియ్యం, కెనడా నుంచి దిగుమతి చేసుకునే ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తులు తమ మార్కెట్లను దెబ్బతీస్తున్నాయని చెప్పుకొచ్చారు. భారత్ తమ దేశంలోకి బియ్యాన్ని డంపింగ్ చేసి, తమను ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆరోపించారు. ఓ రైస్ మిల్ సీఈవో మాట్లాడుతూ.. భారతదేశం, థాయిలాండ్, చైనా వల్ల అమెరికన్ రైతులు ఇబ్బంది పడుతున్నారని ట్రంప్ దృష్టికి తీసుకొచ్చారు.

భారత్ తన బియ్యం పరిశ్రమను చట్టవిరుద్ధమైన సబ్సిడీలతో ప్రోత్సహిస్తోందన్నారు. కాగా, డిప్యూటీ యూఎస్ టీఆర్ రిక్ స్విట్జర్ నేతృత్వంలోని అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయ సీనియర్ ప్రతినిధి బృందం త్వరలో భారతదేశంతో వాణిజ్య చర్చలను తిరిగి ప్రారంభించనుంది. మరోవైపు ద్వుపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.