calender_icon.png 10 December, 2025 | 6:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండిగోకు కేంద్రం షాక్

10-12-2025 02:23:56 AM

  1. శీతాకాల సర్వీస్ షెడ్యూళ్లలో 1-0% కోత
  2. ఎనిమిదో రోజూ సర్వీసులకు అంతరాయం
  3. దేశవ్యాప్తంగా 400కి పైగా సర్వీసులు రద్దు
  4. ప్రజలను ఇబ్బంది పెట్టే సంస్థను ఉపేక్షించం:
  5. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు
  6.   10వ తేదీ నాటికి సాధారణ స్థితి: ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: ఇండిగో విమానయాన సంస్థ పరిధిలో ఆపరేషనల్ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ఎనిమిదో రోజు మంగళవారమూ దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా 400 కిపైగా విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. ఈ వ్యవహారంపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మరోసారి తీవ్రం గా స్పందించింది. శీతాకాల షెడ్యూళ్లలో ‘ఇండిగో’ కేటాయించిన సర్వీసుల్లో 10 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది.

దీంతో సంస్థ పరిధిలో రోజుకు 2,200 విమాన సర్వీసులు న డుస్తుండగా, వాటిలో 200కు పైగా సర్వీసులు తగ్గనున్నాయి. సర్వీసుల డిమాండ్ ఎక్కువగా ఉన్న ఏరియాల్లోనూ ఈ కోత ఉంటుందని తెలిసింది. ప్రధాని మోదీ కూడా మొదటిసారి ఇండిగో సంక్షోభంపై మాట్లాడారు. వ్యవస్థలను మెరుగుపరిచేందుకే నిబంధనలనీ, ప్రజలను ఇబ్బందిపెట్టేందుకు కాదని తెలిపారు. కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు లోక్‌సభలో స్పందిస్తూ.. ఎంత పెద్ద సమస్థ అయినా సేవలు, భద్రత విషయంలో రాజీలేదని ఇండియా సంక్షోభాన్ని ఉద్దేశిస్తూ వ్యాక్యానించారు.

సంస్థ సీఈవో పీటర్ ఎల్బర్స్ ‘ఎక్స్’లో విడుదల చేసిన వీడియో సందేశంలో విమాన సర్వీసుల అంతరాయంపై ప్రయాణికులకు క్షమాపణలు తెలిపారు. సర్వీసుల అంతరాయం విషయానికొస్తే.. ఢిల్లీ ఎయిర్‌పోర్టు పరిధిలో 52 విమానాలు, బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో 121 సర్వీసులు, హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో 58 సర్వీసులు, ముంబై ఎయిర్‌పోర్టులో 31, చెన్నులో 41 సర్వీసులు రద్దయ్యాయి. అలాగే కేరళ, గుజరాత్, అగర్తలా వంటి ఇతర ఎయిర్‌పోర్టుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దేశీయ విమానయాన రంగంలో ఇండిగో 64.2 శాతం వాటా కలిగి ఉంది.

అందుకే సంస్థ పరిధిలోని సంక్షోభం యావత్ దేశ విమానయాన నెట్‌వర్క్ దెబ్బతీస్తున్నది. సంస్థ పరిధిలో ప్రస్తుతం 400 విమానాలుప ప్రయాణికులకు సేవలందింస్తున్నాయి. ఒక ఏడాదిలో సుమారు 10 కోట్ల మందిపైగా ప్రయాణికులు ఇండిగో సర్వీసులను వినియోగిస్తారు. కాబట్టి, సర్వీసుల్లో చిన్న అంతరాయం ఏర్పడినా, ఎక్కువ మంది ప్రయాణికులను ప్రభావితం చేస్తుంది. ఇండిగో సంక్షోభంపై ఏఐసీసీ అగ్రనేత ‘ఎక్స్’ ద్వారా స్పందించారు. దేశీయ విమానయానంపై ఇండిగో గుత్తాధిపత్యాన్ని చలాయిస్తుందని మండిపడ్డారు.

నిబంధనలు వేధించేందుకు కాదు.. : ప్రధాని నరేంద్ర మోదీ

ఇండిగో సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారని కేంద్ర మంత్రి కిరణ్ రిజజు మీడియాకు వెల్లడించారు. ఢిల్లీ వేదికగా జరిగిన ఎన్డీయే సమావేశంలో మోదీ  మాట్లాడారని తెలిపారు. ‘వ్యవస్థలను మెరుగుపర్చేందుకే నిబంధనలు ఉంటాయి తప్ప.. అవి ప్రజలను వేధించేందుకు కాదు. చట్టాలు ప్రజలపై భారంగా పరిణమించకూడదు’ అని మోదీ అభిప్రాయపడ్డారని తెలిపారు.

ఎంత పెద్ద సంస్థునా సహించేది లేదు.. : కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి  రామ్మోహన్‌నాయుడు

ఇండిగో సంక్షోభంపై లోక్‌సభలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ‘ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించే ఏ సంస్థను ఉపేక్షించబోం. ఎంత పెద్ద సంస్థునా సహించబోం. ప్రయాణికులకు సేవలు అందించే విషయంలో వెనుకాడం. భద్రత విషయంలో రాజీ లేదు. విమానాశ్రయాల్లో నెలకొన్న పరిస్థితులను మళ్లీ సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

టికెట్లకు సంబంధించిన రీఫండ్ అందిస్తున్నాం. లగేజీని కూడా ప్రయాణికులకు చేర్చే చర్యలు కొనసాగుతున్నాయి. డీజీసీఏ ఇప్పటికే ఇండిగో యాజమాన్యానికి షోకాజ్ నోటీసులిచ్చింది. దర్యాప్తు ప్రారంభమైంది. దర్యాప్తు అనంతరం తగిన చర్యలు తీసుకుంటాం. డీజీసీఏ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తామని ఇండిగో హామీ ఇచ్చింది. రోస్టరింగ్ నియమాలను అమలులో వైఫల్యమే సర్వీసుల రద్దుకు దారితీసింది. ఈరంగంలో మేం గుత్తాధిపత్యానికి తావు ఇవ్వం’ అని స్పష్టం చేశారు.

సర్వీసులు సాధారణ స్థితికి: సీఈవో

ఇండిగో సంక్షోభంపై తాజాగా సంస్థ సీఈవో పీటర్ ఎల్బర్స్ ‘ఎక్స్’ వేదికగా వీడియా విడుదల చేశారు. ‘మా సంస్థ పరిధిలో విమానయాన కార్యకలాపాలు ఈనెల 10 నాటికి సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. సర్వీసుల అంతరాయం మిమ్మల్ని తీవ్రంగా బాధించాయని తెలుసు. అందుకు మేం చింతిస్తున్నాం. అందుకు మా క్షమాపణలు. ఇప్పటికే 745.7 కోట్ల మేర ప్రయాణికులకు రీఫండ్ చేశాం. విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన లగేజీని మీ ఇంటివద్దకు చేరుస్తున్నాం. ప్రభుత్వానికి మా సహకారం అందిస్తున్నాం. సంక్షోభ సమస్యలకు గల కారణాలను గుర్తించి పరిష్కరించే పనిలో ఉన్నాం’ అని స్పష్టం చేశారు.