బీసీల హక్కుల్ని కాంగ్రెస్ కాలరాసింది
ఫేక్ వీడియోలతో హస్తం పార్టీ తప్పుడు ప్రచారాలు చేస్తోంది
బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే లక్ష్మణ్
హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ బీసీ కోటాలో గెలిచారని, ఇది బీసీల హక్కులను కాలరాయడం కాదా అని కాంగ్రెస్ పార్టీని బీజేపీ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ ప్రశ్నించారు. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పంచుతామంటే కాంగ్రెస్‌కు కడుపుమంట ఎందుకని, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల వ్యవహారంతో అమాయక బీసీలు మోసపోతున్నారని ఆరోపించారు. ముస్లింలకు రిజర్వేషన్లు మత పరమైనవి కాదా అని అడిగారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం మాట్లాడుతూ... సమైక్యాంధ్రప్రదేశ్‌ను రాష్ట్రాన్ని ప్రయోగశాలగా మార్చేసి.. అనంతరాం కమిషన్ సూచన మేరకు సామాజికంగా వెనకబడ్డ ముస్లింలను బీసీలో చేర్చినప్పటికి కూడా 2004, 2009లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ-ఈ గ్రూపును క్రియేట్ చేసి 14 ముస్లిం సామాజికవర్గాలను చేర్చి 4 శాతం రిజర్వేషన్లు కల్పించిందని గుర్తు చేశారు.
ఎస్సీ, బీసీ, ఎస్టీలకు దక్కాల్సిన వాటాను కేవలం ముస్లింలకు కల్పించడం అన్యాయమన్నారు. విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో బీసీలు నష్టపోతున్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నిచారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఉంటే బీఆర్‌ఎస్ ప్రభుత్వం దానిని కుదించి 18 శాతానికి తగ్గిస్తే నోరువిప్పని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రిజర్వేషన్ల గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. జీహెచ్‌ఎంసీలోని 150 డివిజన్లలో బీసీలకు 50 డివిజన్లలో సీట్లు కేటాయిస్తే 31 సీట్లలో ముస్లిం అభ్యర్థులు బీసీల పేరు మీద గెలిచారని.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు వ్యవహరించే తీరు అమాయక బీసీలను మోసం చేయడమేనన్నారు.
తప్పుడు ప్రచారాలు...
కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారంపై లక్ష్మణ్ మండిపడ్డారు. కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరని తెలిపారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ చేస్తున్న అవాస్తవ ప్రచారంలో ఆర్‌ఎస్‌ఎస్‌ను లాగడంపైనా ఫైరయ్యారు. దీనిపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ స్వయంగా తాము రాజ్యాంగ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని స్పష్టత ఇచ్చారని గుర్తుచేశారు. పదేళ్ల ప్రధాని మోదీ పాలనపై విమర్శలు చేసేందుకు అవకాశం లేక కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి బురదజల్లే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. పార్లమెంటు అంటే ప్రజాస్వామ్యానికి ప్రతీక అని, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని పత్రికాముఖంగా విలేకరుల సమావేశంలో ఆ బిల్లును చించివేసిన చరిత్ర రాహుల్ గాంధీదని లక్ష్మణ్ గుర్తు చేశారు.




