హల్ద్వానీ ఘటనకు నిరసనగా కాంగ్రెస్ పాదయాత్ర, సత్యాగ్రహం
ఆదిలాబాద్, ఆగస్టు 14 (విజయక్రాంతి): హల్ద్వానీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో నిర్వహించిన ర్యాలీ ప్రదేశాన్ని గంగాజలంతో ‘శుద్ధీకరణ’ పేరుతో శుద్ధి చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వరకు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాదయాత్రగా తరలివెళ్లి అంబేద్కర్ చౌక్ వద్ద సత్యాగ్రహ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలో వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటనలు అలవాటుగా మారిపోయాయని, బిజెపి ప్రేరిత హిందూ అతివాద సంఘాలు మల్లికార్జున ఖర్గే దళిత నాయకుడు అవడంతో ఆయన నిర్వహించిన సభా ప్రాంతాన్ని శుద్ధి చేశారని, ఇది బిజెపికి దళితుల పట్ల ఉన్న ఆలోచన విధానానికి అద్దం పడుతుందన్నారు. ఇలాంటి ఘటనలు సమాజంలో విభజనను పెంచడంతో పాటు రాజ్యాంగం కల్పించిన సమానత్వం, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వం, మానవ గౌరవం వంటి విలువలను అవమానించడమేనని పేర్కొన్నారు.
దేశంలో ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ మల్లెపూల నరసయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, మాజీ డిసిసి సాజిద్ ఖాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ లు మల్లెపూల సత్యనారాయణ(బోథ్), కొమరం సత్యవతి కోటేష్(ఇచ్చోడ), మాజీ డిసిసిబి చైర్మన్ అడ్డి భోజ రెడ్డి, మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






