15 August, 2026 | 3:42 AM

ఉద్యమ ప్రతీక తెలంగాణ భవన్

15-08-2026 01:44 AM

పోరాట వ్యూహ, ప్రతివ్యూహాల రచనకు ఊపిరి

రెండు దశాబ్దాల సందర్భంగా కేటీఆర్ శుభాకాంక్షలు

హైదరాబాద్, ఆగస్టు 14 (విజయక్రాంతి): తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమ వేదిక, ఆత్మగౌరవ ప్రతీక తెలంగాణ భవన్ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను చాటేలా, తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వాన్ని నిలబెట్టేలా తెలంగాణ భవన్ నిలిచిందని ఆయన పేర్కొన్నారు.

ఉద్యమకారులకు ఒక వేదికగా నిలిచిన తెలంగాణ భవన్.. తెలంగాణ ఉద్యమ సమయంలో వ్యూహ, ప్రతివ్యూహాల రచనకు కేంద్రంగా మారిందని కేటీఆర్ గుర్తుచేశారు. స్వరాష్ట్ర సాధన అనంతరం దశాబ్దకాలం తెలంగాణ అప్రతిహత ప్రగతి ప్రస్థానానికి కూడా తెలంగాణ భవన్ సాక్షీభూతంగా నిలిచిందని వెల్లడించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ విఫల పాలనలో ప్రజల సమస్యలపై పోరా డేందుకు తెలంగాణ భవన్ ఒక ‘జనతా గ్యారేజ్’లా మారిందని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌ను తెలంగాణ ‘భువన విజయం’గా అభివర్ణించారు. రెండు దశాబ్దాల ప్రస్థానం సందర్భంగా ఉద్యమకారులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.