calender_icon.png 18 February, 2026 | 5:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొర్రూర్ మున్సిపాలిటీని అక్రమంగా కైవసం చేసుకున్న కాంగ్రెస్: ఎంపీ రవిచంద్ర

18-02-2026 01:05:54 AM

మహబూబాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): తొర్రూర్ పట్టణ ప్రజల తీర్పునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అక్రమ పద్ధతుల్లో మునిసిపాలిటీని కైవసం చేసుకోవడం తీవ్ర బాధాకరమని బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర వ్యాఖ్యానించారు. ఎన్నికల సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి గడపగడపకు వెళ్లి బీఆర్‌ఎస్ ను గెలిపించారన్నారు.

మునిసిపాలిటీలో 9 మంది కౌన్సిలర్స్ గెలిపించినా కూడా పట్టణ ప్రజల అభీష్టాన్ని, తీర్పును అధికార పార్టీ నాయకులు ఏ మాత్రం ఖాతరు చేయకుండా, గౌరవించకుండా కుట్రలు, కుతంత్రాలతో కౌన్సిల్ ను కైవసం చేసుకోవడం తీవ్ర అభ్యంతరకరమన్నారు. ఎంపీ రవిచంద్ర మాజీ మంత్రి దయాకర్ రావు, లోక్ సభ మాజీ సభ్యురాలు మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిలతో కలిసి మంగళవారం తొర్రూరులోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

సరిపడ సంఖ్యాబలం లేకున్నా కూడా తొర్రూర్ మునిసిపల్ కౌన్సిల్ ను ఎలాగైనా దక్కించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర పన్ని సోమవారం పోలీసులతో యుద్ధ వాతావరణం సృష్టించి ఎన్నికను వాయిదా వేయించారని రవిచంద్ర మండిపడ్డారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ లో ఎక్స్ అఫీషియో మెంబర్ గా కొనసాగుతూ నిబంధనలకు తిలోదకాలిచ్చి తొర్రూరులో తిరిగి నమోదు చేయించుకోవడం శోచనీయమన్నారు.

ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన పత్రాలను ఎంపీ రవిచంద్ర మీడియా ప్రతినిధులకు చూపించారు. అన్ని వర్గాల ప్రజలు తమ పక్షానే ఉన్నారని, వాస్తవంగా, నైతికంగా బీఆర్‌ఎస్ విజయం సాధించిందని, కాంగ్రెస్ అనైతికంగా వ్యవహరించి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని ఎంపీ వద్దిరాజు వ్యాఖ్యానించారు.