రిజర్వేషన్ల వ్యతిరేకి కాంగ్రెస్
రిజర్వేషన్లపై కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోంది
బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేస్తుంటూ దుష్ప్రచారం
నాటి ప్రధాని నెహ్రూ రిజర్వేషన్లను వ్యతికించారు
బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్ కామెంట్స్
హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల అంశంపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోందని బీజేపీ ఓబీసీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డా. కె లక్ష్మణ్ ఆరోపించారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఘర్షణ పూరితమైన వాతావరణాన్ని సృష్టించి, చీలికల ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి కుట్రలకు తెర లేపారని ఫైరయ్యారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని, రాష్ట్రం రావణకాష్టంలా మారినా ఫర్వాలేదనే రీతిలో ఆయన రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఓ వర్గం ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద బురదజల్లే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
కుట్రలో భాగంగానే బీజేపీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందని, రాజ్యాంగాన్ని మార్చేస్తుందని ఫేక్ ప్రచారానికి తెరలేపారన్నారు. ఇలాంటి ఫేక్ ప్రచారం ద్వారా రిజర్వేషన్ల అనుకూల, వ్యతిరేకుల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు. రిజర్వేషన్ల రద్దుకు తాము వ్యతిరేకమని ప్రధాని మోదీ, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్వయంగా చెప్పినా కాంగ్రెస్ పార్టీ మాత్రం తప్పుడు ప్రచారం మానడం లేదని డాక్టర్. లక్ష్మణ్ పేర్కొన్నారు. ఫేక్ వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీపై అబద్దాలు ప్రచారం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. గుజరాత్ పెద్దలు, ఢిల్లీ పోలీసులు తెలంగాణ మీద దాడులు చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి సెంటిమెంట్‌కు ఆయింట్‌మెంట్ పూస్తున్నారని విమర్శించారు.
రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నాటి ప్రధాని నెహ్రూ లేఖ
రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ప్రధాని హోదాలో ఉన్న నెహ్రూ నాడు ముఖ్యమంత్రులకు లేఖలు రాశారని లక్ష్మణ్ గుర్తు చేశారు. రిజర్వేషన్ల వల్ల ప్రతిభ దెబ్బతింటుందని, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తే దేశం ప్రపంచంలోనే రెండో శ్రేణి పౌరులతో నిండి చులకన అవుతుందని నెహ్రూ మాట్లాడినట్లు గుర్తు చేశారు. రిజర్వేషన్లకు అనుకూలంగా నాడు కాకా కలేల్కర్ కమిషన్ నివేదిక ఇస్తే దాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదన్నారు. అంతేకాదు, 17 ఏళ్ల పాటు బీసీల రిజర్వేషన్ల కోసం ఏ ఒక్క కమిటీని కూడా వేయలేదన్నారు. 1990లో పార్లమెంటులో మండల్ కమిషన్, వీపీ సింగ్ కమిటీ 27 శాతం బీసీ రిజర్వేషన్లపై నివేదికలు ప్రవేశపెడితే రాజీవ్ గాంధీ విబేధించారని, కుల సామాజిక వర్గాలపై కాకుండా ఆర్థిక స్థితిగతులు పరిశీలించి నివేదిక ఇవ్వాలని ప్రతిపాదించారని గుర్తు చేశారు.




