28 March, 2026 | 7:35 PM

జిల్లాలు రద్దు చేస్తే ప్రజల చేతిలో భస్మీపటలం

04-05-2024 01:22 AM

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 

వనపర్తి, మే 3 (విజయక్రాంతి): ప్రజలకు పరిపాలన సౌలభ్యం కోసం మాజీ సీఎం కేసీఆర్ నూతన జిల్లాల ఏర్పాటు చేశారని, ఇప్పుడు జిల్లాలను రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల చేతిలో భస్మీపటలం తప్పదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం వనపర్తిలోని ఆయన స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. ఆచరణకు సాధ్యం కాని హామీలను ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. చిత్తశుద్ది ఉంటే అన్ని హామీలు అమలు చేసి ఓటు అడగాలని డిమాండ్ చేశారు. నూతన జిల్లాల ఏర్పాటు వల్ల ప్రజల జీవన ప్రమాణాలు, ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయని చెప్పారు. జిల్లాల రద్దుపై మంత్రి జూపల్లి కృష్ణారావు , రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, జడ్పీటిసి రఘుపతిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.