23-02-2026 12:51:19 AM
బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి
నిజామాబాద్, ఫిబ్రవరి 22 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేస్తోంద ని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. రైతుల సమస్యలపై పోరాడుతున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు గురిచేస్తోందని రేవంత్ సర్కార్ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ గతంలో వేల్పూర్ మండల కేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి సంబంధిం చి 32 మంది బీఆర్‌ఎస్ నాయకుల తోపా టు రైతులపై కేసులు నమోదు చేశారన్నారు. రైతుల సమస్యల నమస్కారం కోసం పోరాడితే అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారన్నారు.
రైతులకు ఇచ్చిన హామీల పోరాటం చేస్తున్న 32 మంది బీఆర్‌ఎస్ నాయకులు, రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారనీ ఆ కేసులను బేషరతుగా ఎత్తివేయాలి అన్నారు. ఈ మేరకు ఆదివారం వేల్పూర్ పోలీస్ స్టేషన్కు పార్టీ శ్రేణులతో కలిసి వెళ్లిన ఆయన, పోలీసుల నుంచి నోటీసులు స్వీకరించారు. అంతకుముందు నల్ల దుస్తులు ధరించి, నల్ల జెండా లతో ప్రభుత్వ తీరుకు వ్యతిరేక నినాదాలు చేస్తూ భారీ నిరసన చేపట్టారు. చట్టం రేవంత్ రెడ్డికి చుట్టమా? అని ప్రశ్నించారు.
వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గతంలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క రాజ్భవన్ ముందు రోడ్డుపై కూర్చుని ధర్నా చేస్తే ఎందుకు కేసులు పెట్టలేదని ఈసందర్భంగా ఆయన గుర్తు చేశారు. అనుమతి తీసుకుని శాంతియుతంగా నిరసన తెలిపిన తమపై ఎందుకు కేసులు పెడుతున్నారని ప్రశ్నించారు. చట్టం అనేది అధికార పక్షానికి ఒకలా, ప్రతిపక్షానికి మరోలా ఉంటుందా అని డీజీపీని నిలదీశారు. అక్రమ కేసులతో తమ గొంతు నొక్కలేరని, అణచివేసే కొద్దీ స్ప్రింగ్లా పైకి లేచి ప్రజల పక్షాన పోరాడుతామని స్పష్టం చేశారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ హామీలు అమలు చేయాలి,రుణమాఫీ, రైతు భరోసా వంటి హామీలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని వేముల విమర్శించారు. బాల్కొండ నియోజకవర్గంలో 53 వేల మందికి రుణమాఫీ కావాల్సి ఉండగా, కేవలం 22 వేల మందికే చేసి మిగిలిన వారిని మోసం చేశారన్నారు. యూరియా కోసం రైతులు అల్లాడుతున్నారని, యాప్ల పేరుతో రైతులను వేధించడం మానుకోవాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను అక్రమంగా జైల్లో పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.