calender_icon.png 23 February, 2026 | 9:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రలోభాలతో గెలుపు.. నైతిక విజయం మాత్రం కాంగ్రెస్‌దే

23-02-2026 12:50:41 AM

బీఆర్‌ఎస్ నేతలకు, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్కు అయిళ్ల శ్రీనివాస్ గౌడ్ సూటి ప్రశ్నలు

ఆమనగల్లు, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై  పీసీసీ క నేత శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బు, మద్యం, చీరల పంపిణీతో ఓటర్లను ప్రలోభపెట్టి బీఆర్‌ఎస్  అభ్యర్థులు అక్రమంగా విజయం సాధించారని ఆయన ఆరోపించారు. సిద్ధాంతాలకు కట్టుబడి, సామాజిక న్యాయం పాటిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీదే మున్సిపల్ ఎన్నికలో నిజమైన నైతిక విజయమని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం ఆమనగల్ మార్కెట్ కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఓట్లను ప్రలోబాలకు గురి చేయకుండా  తాము గెలిచామని ఊకో దంపుడు ప్రచారాలు చేస్తున్న బీ ఆర్ ఎస్ నేతలు .... మీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు చేత రాజీనామా చేసి మళ్ళీ వస్తారా?‘ అని ఆయన సవాల్ విసిరారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు వరకు 13 వార్డుల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఇంటెలిజెన్స్ రిపోర్టులు సైతం చెప్పాయని, అయితే చివరి నిమిషంలో బీఆర్‌ఎస్ నేత ఉప్పల వెంకటేష్ అడ్డగోలుగా డబ్బు పంపిణీ చేసి ఫలితాలను తారుమారు చేశారని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. 

పది పార్టీలు మారిన వ్యక్తి కాంగ్రెస్ సిద్ధాంతాల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఉప్పల వెంకటేష్ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. బహుజన వాదిగా గుర్తింపు పొందిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తీరుపై శ్రీనివాస్ గౌడ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సిద్ధాంతం ఎక్కడ?: బీఎస్పీని బీఆర్‌ఎస్లో విలీనం చేసినప్పుడే ఆయనకు సిద్ధాంతాలు లేవని తేలిపోయిందన్నారు. ఆమనగల్ మున్సిపల్ చైర్మన్ దవాఖానాపై వీధి రౌడీల్లా దాడి చేయడాన్ని ఆర్ ఎస్ పీ ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. ఒక గిరిజన బిడ్డ చైర్మన్ కావడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారా అని నిలదీశారు.

మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిపై 15 వార్డుల వారిగా పూర్తి వివరాలు సేకరించామని, ఇట్టి విషయంలో ఇప్పటికే ఎమ్మెల్యే పార్టీ పెద్దలతో మాట్లాడాలని త్వరలోనే పార్టీలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు. అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. బీఆర్‌ఎస్ మాయలో పడి తప్పు చేశామని ఆమనగల్ ప్రజలు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారని, కాంగ్రెస్ హయాంలోనే పట్టణ రూపురేఖలు మారుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ఆమనగల్ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని శ్రీనివాస్ గౌడ్ పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంఘ నేత హనుమా నాయక్, మండల,మున్సిపల్ అధ్యక్షులు జగన్,మానయ్య, డీసీసీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, కేశవులు, శివలింగం కృష్ణ నాయక్, వెంకటేష్, కృష్ణ యాదవ్, ఖాదర్ రఫీ, సత్యం, ఆలీ శ్రీకాంత్ పాల్గొన్నారు.