22 August, 2026 | 1:40 AM

అరిగే రమేష్‌పై కాంగ్రెస్ నేతల ఫైర్.. ఆరోపణలకు ఆధారాలెక్కడ?

22-08-2026 12:43 AM

30 ఏళ్లలో రంగంపేటకు ఏం చేశావో చెప్పాలి

ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే సహించం.. కాంగ్రెస్ నేతల ఘాటు హెచ్చరిక

కొల్చారం, ఆగస్టు 21: కాంగ్రెస్ పార్టీలో మూడు దశాబ్దాలుగా కొనసాగి సర్పంచ్, ఎంపీపీ, జడ్పీటీసీ, ఆప్కో డైరెక్టర్ వంటి పదవులు అనుభవించిన అరిగే రమేష్కుమార్ ఇప్పుడు అదే పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని కొల్చారం మండల కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ను ‘బ్రోకర్’గా సంబోధించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆరోపణలు చేసే ముందు ఆధారాలు చూపాలని సవాల్ విసిరారు.

శుక్రవారం పోతంశెట్టిపల్లి హనుమమ్మ గార్డెన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ను కన్నతల్లిగా భావించి పనిచేసిన నాయకులపై రమేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. కాంగ్రెస్ పార్టీ అండతోనే సర్పంచ్ నుంచి ఎంపీపీ, జడ్పీటీసీ, ఆప్కో డైరెక్టర్ వరకు పదవులు దక్కించుకున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

రంగంపేటకు ఏం చేశావో చెప్పాలి

మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లుగారి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. “30 ఏళ్ల రాజకీయ జీవితంలో రంగంపేటకు ఏం అభివృద్ధి చేశావో ప్రజలకు చెప్పాలి” అంటూ రమేష్కు సవాల్ విసిరారు. రంగంపేటను మండల కేంద్రంగా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నప్పటికీ ఆయన స్వార్థం కారణంగానే అది సాధ్యం కాలేదని ఆరోపించారు. యువ నాయకులను తప్పుదోవ పట్టిస్తూ కాంగ్రెస్, జిల్లా నాయకులపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రంగంపేటలో జరిగిన సభకు సంబంధించిన స్థలంపై రమేష్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని, లేదంటే ప్రజల ముందు క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు.

‘ఆధారాలుంటే బయటపెట్టు’

ప్రస్తుతం బీఆర్‌ఎస్లో చేరి కాంగ్రెస్ నాయకులపై విమర్శలు చేయడం వెనుక ఆంతర్యమేమిటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. రమేష్ ఆస్తులకు సంబంధించిన వివరాలను త్వరలో జిల్లా కలెక్టర్తో పాటు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అప్పాజీపల్లి సర్పంచ్ వెంకట్గౌడ్, చిన్నఘనపూర్ సర్పంచ్ మధుసూదన్రెడ్డి, రంగంపేట మాజీ సర్పంచ్ బండి సుజాత రమేష్, అంసాన్పల్లి మాజీ సర్పంచ్ మన్నే శ్రీనివాస్, చిన్నఘనపూర్ సొసైటీ చైర్మన్ మంద నాగయ్య, వరిగుంతం మాజీ ఎంపీటీసీ తుడుం రామకిష్టయ్య, రంగంపేట గ్రామశాఖ అధ్యక్షుడు గొండ కృష్ణ, సంగయ్యపేట గ్రామశాఖ అధ్యక్షుడు ఆగం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.