అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జ్యోతి దంపతులు
వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా సామూహిక వరలక్ష్మి వ్రతం
భూపాలపల్లి, ఆగస్టు 21 (విజయ క్రాంతి): అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జ్యోతి దంపతులు అన్నారు. శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం సందర్భంగా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మంజూరునగర్ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఆలయ ధర్మకర్తలు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి, గండ్ర జ్యోతి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు హాజరై ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గండ్ర వెంకట రమణా రెడ్డి, గండ్ర జ్యోతి మాట్లాడుతూ స్వామివారి, అమ్మవారి ఆశీస్సులతో భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు సుఖసంతో షాలతో, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సెప్టెంబర్ 4 నుండి 7వ తేదీ వరకు జరిగే ఆలయ వార్షికోత్సవ, పవిత్రోత్సవ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని కోరారు.






