12 August, 2026 | 10:06 AM

చింతా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల ఫైర్

12-08-2026 09:26 AM

అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా?

కాంగ్రెస్ నేతల సవాల్ 

సంగారెడ్డి: సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. జగ్గారెడ్డిపై విమర్శలు చేస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. తాము చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌కు సవాల్ విసిరారు. 2017లో సంగారెడ్డిలో రాహుల్ గాంధీ సభ విజయవంతం కావడంతో కేసీఆర్, హరీష్ రావులు జగ్గారెడ్డిపై కక్ష పెంచుకున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలకు చింతా ప్రభాకర్ ఇచ్చిన కౌంటర్ పై కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చింతా ప్రభాకర్ కుటుంబానికి సంబంధించిన భూముల వ్యవహారంపై ప్రశ్నలు లేవనెత్తారు.

సీలింగ్ భూమి రిజిస్ట్రేషన్, దళితుల భూములు, సదాశివపేటలో రోడ్ల కబ్జా, మాలకుంట కబ్జా తదితర అంశాలపై ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ చైర్మన్‌గా ఉన్న సమయంలో మహిళా కౌన్సిలర్ల పట్ల వ్యవహరించిన తీరుపైనా ప్రశ్నించారు. సదాశివపేటలో ఎక్కడికి రమ్మన్నా మేము అక్కడికి వస్తాం.. బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ కాంగ్రెస్ నేతలు సవాల్ విసిరారు. ఇకపై బీఆర్ఎస్ నాయకుల అవినీతి చిట్టాను ఒక్కొక్కటిగా బయటపెడతామని హెచ్చరించారు. ప్రజల కష్టాలు  తీర్చే నాయకుడు జగ్గారెడ్డి అని గుర్తు చేశారు. సమావేశంలో నియోజకవర్గ కన్వీనర్ చేర్యాల ఆంజనేయులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, సీడీసీ చైర్మన్ రామ్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మునిపల్లె సత్యనారాయణ, కూన సంతోష్, షఫీ హఫీజ్, కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.