కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని సందర్శించిన కాంగ్రెస్ నాయకులు
రామాయంపేట: మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించారు. రెండు రోజుల క్రితం హాస్టల్ భవనంపై నుండి పదవ తరగతి విద్యార్థి కిందపడి గాయాలు కాగా పాఠశాలలో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితురాలి బంధువులను పరామర్శించారు. బాలికకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. హనుమంతరావు ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి నెలకు సరిపడా నిత్యవసర సరుకులు అందజేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం పూర్తిస్థాయిలో బాలిక బాధ్యత తీసుకొని సరైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు. స్థానిక పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనం, నిత్యవసర సరుకులు, కూరగాయలు, డైనింగ్ హాల్ లను వారు పరిశీలించారు. నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చౌదరి సుప్రభాత్ రావు, రమేష్ రెడ్డి, అల్లాడి వెంకటి, చింతల స్వామి తదితరులు పాల్గొన్నారు.




