14-11-2025 10:19:01 AM
హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఓట్ల(Jubilee Hills by election counting) లెక్కింపు కొనసాగుతోంది. మూడో రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్(Congress candidate Naveen Yadav) ఆధిక్యంలో కొనసాగుతున్నారు. షేక్ పేట్, ఎర్రగడ్డ, రెహమత్ నగర్ డివిజన్లలో ఓట్ల లెక్కింపు పూర్తి అయిందని అధికారులు పేర్కొన్నారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తర్వాత ఓటర్లు వేసిన ఓట్ల లెక్కింపు చేపట్టారు. గట్టి భద్రత మధ్య, అధికార కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్ కు కీలకమైన ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. లెక్కింపు ప్రక్రియ 10 రౌండ్లలో పూర్తవుతుంది. నవంబర్ 11న జరిగిన పోలింగ్‌లో 48.49 శాతం ఓట్లు పోలైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం అర్హులైన ఓటర్ల సంఖ్య 4.01 లక్షలు కాగా, 1.94 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఏడాది జూన్‌లో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. బిజెపి ఎల్ దీపక్ రెడ్డిని నిలబెట్టగా, గోపీనాథ్ భార్య సునీత బిఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ అభ్యర్థికి అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎఐఎంఐఎం మద్దతు ఉంది.