18-01-2026 08:28:05 PM
ఐక్యతతోనే ఘన విజయం: డిసిసి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్
బిచ్కుంద,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రాబోయే కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులన్నీ ఐక్యంగా పనిచేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ పిలుపునిచ్చారు. ఆదివారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మార్కెట్ యార్డులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
పార్టీ అధిష్టానం అధికారికంగా బలపరిచిన చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించుకోవడమే ఏకైక లక్ష్యంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని స్పష్టం చేశారు. పార్టీ కోసం నిజాయితీగా శ్రమించిన ప్రతి కార్యకర్తను తప్పకుండా గుర్తించి, రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సముచిత అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే భవిష్యత్తులో ఇచ్చే నామినేటెడ్ పోస్టుల్లోనూ పార్టీ కోసం పనిచేసిన వారికే ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు.
పార్టీలో ఎవరికీ అన్యాయం జరగకుండా, కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా తాను పూర్తి బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు. ఈ ప్రక్రియ మొత్తం జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు,స్థానిక ఇన్‌చార్జిల సమన్వయంతో సాగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ... వ్యక్తిగత అభిప్రాయాలు, అంతర్గత భేదాభిప్రాయాలను పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా అందరూ ఒక్కటిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణుల ఐక్యతే కాంగ్రెస్ బలమని, ఆ ఐక్యతతోనే మున్సిపల్ఠ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
అంతేకాక, కామారెడ్డి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలను గెలిపించి, ఆ విజయాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బహుమతిగా అందించాలనే సంకల్పంతో పని చేయాలి అని వారు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.పార్టీ ఐక్యతే లక్ష్యం – కాంగ్రెస్ విజయమే ధ్యేయం అనే నినాదంతో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు.