21-12-2025 03:18:43 PM
గౌహతి: స్వాతంత్య్రానికి ముందు అస్సాంను పాకిస్తాన్‌కు అప్పగించడానికి కాంగ్రెస్ కుట్ర పన్నిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. శనివారం గౌహతిలో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శించారు. అస్సాంను తూర్పు పాకిస్తాన్‌లో భాగం చేయడానికి ముస్లిం లీగ్, బ్రిటిష్ వారితో చేతులు కలిపేందుకు కాంగ్రెస్ పాపం చేసిందన్నారు. ముస్లిం లీగ్, బ్రిటిష్ వారు కలిసి దేశ విభజనకు రంగం సిద్ధం చేస్తున్నప్పుడు, అస్సాంను అవిభక్త బెంగాల్, తూర్పు పాకిస్తాన్‌లో భాగం చేసేందుకు ఒక ప్రణాళిక రూపొందించబడింది.
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభ ఎంపీ మాణికం ఠాగూర్ ఎక్స్‌లో మోదీ చేసిన ఈ ఆరోపణను ఖండించారు. అది చారిత్రాత్మకంగా అవాస్తవమని, రాజకీయ ప్రేరేపితమని పేర్కొన్నారు. అస్సాంను పాకిస్తాన్‌కు అప్పగించే ప్రతిపాదన లేదని ఠాగూర్ రాశారు. అస్సాం హిందూ మెజారిటీ ప్రావిన్స్, విభజన ప్రణాళిక ప్రకారం పాకిస్తాన్ కోసం ఎప్పుడూ నియమించబడలేదని, ప్రశ్నలో ఉన్న ఏకైక ప్రాంతం అస్సాంలోని సిల్హెట్ జిల్లా ముస్లిం మెజారిటీ ప్రాంతమని తెలిపారు.
స్వాతంత్య్రం తర్వాత అస్సాంకు తొలి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నాయకుడైన గోపీనాథ్ బోర్డోలోయ్ పనిచేశారు. ఆయన పేరు మీద గువహతిలో భారతదేశపు మొట్టమొదటి ప్రకృతి నేపథ్య విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఆ మహనీయుడి 80 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. అస్సాంను రక్షించడానికి బోరదోలోయ్ కాంగ్రెస్‌ను ధిక్కరించారని, ఆయన తన సొంత పార్టీకే ఎదురు నిలిచారని ప్రధానమంత్రి అన్నారు. అస్సాం గుర్తింపును నాశనం చేసే ఈ కుట్రను ఆయన వ్యతిరేకించి, అస్సాం దేశం నుండి విడిపోకుండా కాపాడారని మోదీ వివరించారు.