21-12-2025 04:04:43 PM
నేను చనిపోవాలని శాపాలు
హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... నన్ను దూషించడమే ఈ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని, తను చనిపోవాలని శాపాలు పెట్టడమే రాష్ట్ర ప్రభుత్వ విధానమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించిందన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని, పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలైతే బీఆర్ఎస్ సత్తా తెలిసేదాని కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ పై ప్రజా వ్యతిరేకత ఈ ఎన్నికల ఫలితాల్లో కనిపించిందని, పార్టీలు గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గర్వంతో ఎగిరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెప్పారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్త పాలసీ కూడా తేలేదని, తీసుకువచ్చిన పాలసీ రియల్ ఎస్టేట్ కోసమే అని కేసీఆర్ ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గిందని, బీఆర్ఎస్ హయంలో యూరియా ఇంటికి, చేను వద్దుకు వచ్చేదని, కానీ ఇప్పుడు యూరియా కోసం కుటుంబమంతా లైన్ లో పరిస్థితి ఏర్పడిందని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకం ప్రకటించకపోగా ఉన్న వాటిని ఆపేసిందని, వైఎస్ఆర్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకాన్ని అసెంబ్లీ వేదికగా తను ప్రశంసించినట్లు గుర్తు చేశారు. అలాగే ఆరోగ్యశ్రీ మొత్తాన్ని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచానని, కానీ ఈ కాంగ్రెస్ సర్కార్ ఏం చేస్తోంది..? అని మాజీ ముఖ్యమంత్రి ప్రశ్నించారు.ఆఖరికి కేసీఆర్ కిట్ పథకాలను కూడా నిలిపి వేసిందని, బస్తీ దవాఖానాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.