‘పోరు’గల్లు

29-04-2024 01:58:26 AM

ఉద్యమాలకు ఊపిరి.. తిరుగుబాటే వైఖరి

అన్ని పార్టీలకు ఆదెరువు వరంగల్ 

పార్లమెంట్ స్థానంలో పీడీఎఫ్ పార్టీదే తొలి గెలుపు  

తెలంగాణ వచ్చి తర్వాత రెండు బీఆర్‌ఎస్ విజయం

ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షకు ప్రజల పట్టం

వరంగల్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): ఓరుగల్లు.. ఉద్యమానికి ఊతం. ధిక్కారానికి ప్రతిరూపం. అన్యాయం జరిగితే సహించని పోరుతత్వం. ధర్మంగా సాగితే సాగిలాపడే దాతృత్వం. మండే నిప్పుకు, కాలే కడుపునకు మధ్య సాగిన పోరులో తొవ్వలు వెతుక్కుం టూ భగ్గున మండిన యవ్వన ఛాయలు. ఆవేశ క్షణాన రాలిన లేత పిందెలు. రాజుల ధీరత్వం ముందు సామంతుల లౌక్యపు తం త్రం జతకలుస్తుందని తెలిసిన వేళ ఎదురు తిరిగి నిలిచిన పరాక్రమం. అధికారపు నిర్లక్యపు తావులో ఎండిన పంటల్లో ఎరుపు మరకలు పులుముకున్న వీర నేల పోరుగల్లు వరంగల్లు. తలొగ్గక, తనువు చాలించడానికైనా వెరవని తెగింపు ఏకశిల నగరి సొంతం. 

తొలి గెలుపు పీడీఎఫ్‌దే.. 

వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి ఇప్పటివరకు 18 సార్లు ఎన్నికలు జరగగా ఎనిమిది సార్లు కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. మొట్టమొదటి ఎన్నికలో పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) పార్టీ  తరఫున పోటీ చేసిన పెండ్యాల రాఘవరావు గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగెస్ ప్రభంజనం కొనసాగింది. 1971లో తెలంగాణ ప్రజాసమితి జయకేతనం ఎగురవేసి అందరి అంచనాలు తలకిందులు చేసిం ది. ఎన్టీయార్ రాజకీయ రంగ ప్రవేశంతో 1984లో ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన డాక్టర్ కల్పనాదేవి ఎంపీగా ఎన్నికై మొట్టమొదటి మహిళా ఎంపీగా చరిత్ర లిఖించారు. ఇలా వరంగల్ నియోజకవర్గం అటు కాం గ్రెస్, ఇటు టీడీపీ మధ్య పోరుసాగుతున్న తరుణంలో టీఆర్‌ఎస్ ఆవిర్భావం ఓ మలు పుగా చెప్పవచ్చు. ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్న ప్రజలు 2004లో రవీంద్రనాయక్‌కు పట్టం కట్టారు.  

రెండు పార్టీలు హ్యాట్రిక్ 

వరంగల్ లోక్ సభ స్థానానికి కాంగ్రెస్, టీడీపీ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశాయి. 1957 నుంచి 1971 వరకు మూడు పర్యాయాలు కాంగ్రెస్ వరుస విజయాలు సాధించింది. అలాగే టీడీపీ 1996 నుంచి 2004 వరకు వరుసగా మూడు సార్లు జయకేతనం ఎగురవేశాయి. 

ఎప్పుడు.. ఎవరంటే ?

1952లో తొలి ఎంపీగా పెండ్యాల రాఘవరావు పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ పార్టీ  

1957 వరకు మూడు పర్యాయాలు వరుసగా కాంగ్రెస్ అభ్యర్థులు సాదత్ అలీఖాన్, బకర్ అలీ మీర్జా, రామసహాయం సురేందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. 

1971లో తెలంగాణ ప్రజాసమితి తరఫున ఎస్‌బీ గిరి ఎన్నికయ్యారు. 

1977 వరకు రెండు పర్యాయాలు కాంగ్రెస్ అభ్యర్థులు జీ మల్లికార్జునరావు, కమాలుద్దీన్ అహ్మద్ జయకేతనం.  

1984లో టీడీపీ తరఫున డాక్టర్ టీ కల్పనాదేవి విజయం. 

1989 వరకు కాంగ్రెస్ నేత రామసహాయం సురేందర్‌రెడ్డి వరుసగా రెండు సార్లు గెలుపొందారు. 

1996 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అజ్మీరా చందూలాల్ వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. 

1999లో టీడీపీ అభ్యర్థి బోడకుంటి వెంకటేశ్వర్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 

2004లో టీఆర్‌ఎస్ నుంచి ధరావత్ రవీంద్ర నాయక్ గెలుపొందారు. 

2008 ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎంపికయ్యారు. 

2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచిన సిరిసిల్ల రాజయ్య జయకేతనం.  

2014 లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి గెలుపొందారు. 

2015లో జరిగిన ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ గెలుపొందారు. 

2019లో టీఆర్‌ఎస్ అభ్యర్థి పసుసూరి దయాకర్ రెండో సారి విజయకేతనం ఎగురవేశారు. 

మూడు సార్లు ఒక్కరే..

వరంగల్ లోక్ సభ స్థానానికి మూడుసార్లు ఎన్నికైన ఏకైక నేతగా రామసహాయం సురేందర్‌రెడ్డి (ఆర్‌ఎస్) నిలిచారు. 1967, 1989, 1991లో జరిగిన ఎన్నికల్లో ఆయన గెలుపొంది అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. మొదటిసారి గెలిచి పదవీకాలం పూర్తి చేసుకున్న రెండు దశాబ్దాల తర్వాత ఆయన మళ్లీ వరుసగా రెండుసార్లు ఎన్నికయ్యారు.  

ఉద్యమ వేళ ఉప ఎన్నిక.. 

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో టీడీపీ 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో వరంగల్ లోక్ సభ స్థానాన్ని గెలుచుకున్నది. ఉద్యమ నేత కేసీఆర్ మాటకు ఎదురేలేని సమయమైనా టీడీపీ అభ్యర్థిగా ఎర్రబెల్లి దయాకర్‌రావు బరిలో నిలిచి గెలిచిన తీరు ఆశ్చర్యం కలిగించింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా హవా కొనసాగుతుండడం, స్వరాష్ట్రం కోసం సీమాంధ్ర నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న సమయంలో టీడీపీ గెలవడం విశేషం.  

ఒకే ఒక్క మహిళ

వరంగల్ అంటేనే రాణి రుద్రమ, సమ్మక్క, సారలమ్మ ధీరత్వానికి ప్రతీక. అంతటి చరిత్ర కలిగిన వరంగల్ పార్లమెంట్ స్థానానికి 18 సార్లు ఎన్నికలు జరిగితే ఒకే ఒక్కసారి మహిళ ప్రాతినిధ్యం వహించడం గమనార్హం. ఎన్టీ రామారావు స్థాపించిన టీడీపీ నుంచి 1984లో నగరా నికి చెందిన వైద్యురాలు డాక్టర్ కల్పనాదేవి బరిలో నిలిచి గెలిచారు. 75 ఏండ్ల వరంగల్ లోక్ సభ నియోజకవర్గ చరిత్రలో మళ్లీ మహిళా ప్రాతి నిధ్యం లేక కల్పనాదేవీ రికార్డు అలా గే కొనసాగుతున్నది. 

స్వరాష్ట్రంలో బీఆర్‌ఎస్ జోరు..

పదేండ్లలో వరంగల్ లోక్ సభ స్థానానికి మూడుసార్లు ఎన్నికలు జరిగాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కడియం శ్రీహరి సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన సిరిసిల్ల రాజయ్యపై 3,92,574 ఓట్ల మెజార్టీతో గెలు పొందారు. మూడో స్థానంలో బీజేపీ అభ్యర్థి డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్ నిలిచారు. మరుసటి సంవత్సరం 2015లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజ య్యను బీఆర్‌ఎస్ అధినేత, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ బర్తరఫ్ చేసి, కడియం శ్రీ హరిని డిప్యూటీ సీఎంగా చేశారు. దీంతో వరంగల్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. పసునూరి దయాకర్ బీఆర్‌ఎ స్ తరఫున పోటీ చేయగా కాంగ్రెస్ అభ్య ర్థి సర్వే సత్యనారాయణపై 4,59,088 ఓట్ల రికార్డు మెజార్టీతో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన పగిడిపాటి దేవయ్య మూడో స్థానంలో నిలి చారు. 2019 లో జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ సిట్టింగ్ ఎంపీ, బీఆర్‌ఎస్ అభ్య ర్థి దయాకర్‌కు టికెట్ కేటాయించింది. ఆయన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దొమ్మాటి సాంబయ్యపై 3,50,298 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.  

2014 పార్లమెంట్ ఎన్నికల వివరాలు..

అభ్యర్థి పార్టీ వచ్చిన ఓట్లు శాతం

కడియం శ్రీహరి బీఆర్‌ఎస్ 6,61,639 56.33

సిరిసిల్ల రాజయ్య కాంగ్రెస్ 2,69,065 22.91

రామగళ్ల పరమేశ్వర్ బీజేపీ 1,87,139 15.93 

2019 పార్లమెంట్ ఎన్నికల వివరాలు

అభ్యర్థి పార్టీ వచ్చిన ఓట్లు శాతం

పసునూరి దయాకర్ బీఆర్‌ఎస్ 6,12,498 57.69

దొమ్మాటి సాంబయ్య కాంగ్రెస్ 2,62,200 24.7

చింత సాంబమూర్తి బీజేపీ 83,777 7.89