పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పోస్ట్‌మార్టం
- ఫాక్ట్ ఫైండింగ్ కమిటీని ప్రకటించిన ఏఐసీసీ
కమిటీ మెంబర్లుగా పీజే కురియన్, రాకిబుల్ హుస్సేన్, ప్రగతిసింగ్
తక్కువ సీట్లు రావడానికి గల కారణాలపై అధ్యయనం
హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి) : పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధిష్టానం పోస్ట్‌మార్టం చేపట్టింది. రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాలకు 12 నుంచి 14 సీట్లు గెలవాలని లక్ష్యం పెట్టుకోగా ఎనిమిదింటికే పరిమితమైంది. లక్ష్యం చేరుకోక పోవడంపై అధిష్ఠానం పోస్ట్‌మార్టమ్‌కు దిగిం ది. ఫాక్ట్ ఫైండింగ్ కమిటీని నియమించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం ఈ కమిటీని ప్రకటించారు. తెలంగాణతో పాటు మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు కమిటీలను నియమించింది.
తెలంగాణకు ప్రకటించిన కమిటీలో కాంగ్రెస్ సీనియర్ నేతలు పీజే కురియన్, రాకిబుల్ హుస్సేన్, ప్రగతి సింగ్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఎంపీ సీట్లు తక్కువగా వచ్చాయని, అంతే కాకుండా బీజేపీ బలం పెంచు కోవడానికి గల కారణాలేంటీ..? కాంగ్రెస్ నాయకుల మధ్య సఖ్యత లేకపోవడంతో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయా..? నాయకుల సరిగా పెద్దగా దృష్టి పెట్టలేదా..? అనే అంశాలపై కమిటీ దృష్టి సారించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.






