23 July, 2026 | 1:20 AM

జిల్లాలో కాంగ్రెస్ నిరసనల హోరు

23-07-2026 12:44 AM

రంగారెడ్డి, జులై 22 (విజయక్రాంతి): నీట్ పరీక్షల అక్రమాలపై విద్యార్థులకు మద్దతుగా ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలిపిన ఏఐసీసీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అక్రమ అరెస్టును నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. బుధవారం రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పార్టీ అధిష్టానం పిలుపుమేరకు వినూత్న నిరసన కార్యక్రమాలు చేపట్టారు.కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్ మండల కేంద్రం లో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి శాంతియుతంగా నిరసన చేపట్టారు.

మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్, బాలాపూర్, జిల్లెలగూడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి, చిగిరింత పారిజాత నర్సింహారెడ్డిల నేతృత్వంలో నిరసన తెలిపారు. ఇబ్రహీంపట్నం, షాద్నగర్, చేవెళ్ల, ఆమనగల్లలో కాంగ్రెస్ నాయకులు శాంతియుతంగా ఆందోళన చేపట్టారు.

నీట్ పరీక్షల అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని, ప్రతిపక్ష నేతల అరెస్టులు ప్రజాస్వామ్యాన్ని, ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాసేలా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు శంకర్, కిషన్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్ గౌడ్, సర్పంచులు కరుణాకర్ గౌడ్, రవి తదితరులు పాల్గొన్నారు.