09-12-2025 08:33:56 PM
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య..
చిట్యాల (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉచిత హామీలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రజలు ఓటు ద్వారానే తగిన బుద్ధి చెప్పాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం చిట్యాల మండలంలోని గుండ్రంపల్లి, వెలిమినేడు, వేంభాయ్ గ్రామాల్లో పోటీ చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్, వార్డు మెంబర్లకు ప్రజలు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రజలకు ఎన్నో ఉచిత హామీలు ఇవ్వడమే తప్ప వాటిని అమలు చేసింది లేదని, నాయకులు ఏ మొహం పెట్టుకొని ప్రజలను ఓట్లు వేయాలని అడుగుతున్నారని ప్రశ్నించారు.
గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వారిని మోసం చేశారని ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ చెందిన అభ్యర్థులు అదే విధంగా మోసపూరితమైన హామీలు చేసి సర్పంచులుగా, వార్డ్ మెంబర్లుగా గెలిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఇది గమనించి ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్ అభ్యర్థులను గతంలో ఇచ్చిన హామీల అమలుపై వారిని నిలదీయాలని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్పా ఇంకేది కనిపించడం లేదని గ్రామాలు అభివృద్ధి చెందాలంటే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులని ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థులు బైకానీ శ్రీశైలం యాదవ్, వెంకన్న, అరూరి శ్రీశైలం, బొంతల రామకృష్ణారెడ్డి, మల్లారెడ్డి, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.