పాండియన్ నా వారసుడు కాదు..
ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ స్పష్టీకరణ
నా వారసుడిపై ప్రజలే నిర్ణయం తీసుకుంటారు
న్యూఢిల్లీ, జూన్ 8: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత బీజేడీ అధినేత, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ తొలిసారిగా స్పందించారు. ఇటీవలి వరకు ప్రభుత్వంలో, పార్టీలో కీలక పాత్ర పోషించిన మాజీ ఐఏఎస్ వీకే పాండియన్ తన వారసుడు కాదని నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. తన వారసుడు ఎవరనే దానిపై ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని విద్య, వైద్యం, స్పోర్ట్స్, దేవాలయాల పునరుద్ధరణ కార్యక్రమాలు సహా అనేక రంగాల్లో పాండియన్ కృషి ఎంతో ఉందని కొనియాడారు. అయితే పార్టీలో పాండియన్‌కు ఎలాంటి పోస్టు లేదని నొక్కి వక్కాణించారు.
‘నన్ను ఆశీర్వదించి, నాకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచిన ఒడిశా ప్రజలకు ఎంతో కృతజ్ఞుడినై ఉంటా. రాష్ట్రంలో నా పాత్రను సమర్థవంతంగా పోషించానని భావిస్తున్నాను. మా ప్రభుత్వంలో, పార్టీలో మేం భాగస్వామ్యం కావడం ఎంతో గర్వపడుతున్నా’ అని నవీన్ పట్నాయక్ అన్నారు. ‘వీకే పాండియన్ విషయంలో చాలా విమర్శలు వస్తున్నట్టు నా దృష్టికి వచ్చింది. ఇది చాలా దురదృష్టకరం. ఒక అధికారిగా ఆయన అద్భుతమైన సేవలు అందించారు. రెండు తుఫానుల సమయంలో ఆయన ఎంతగానో సేవలు చేశారు.
కరోనా సమయంలో రాష్ట్ర ప్రజలకు సేవలందించారు. ఆ తర్వాత రిటైర్ అయి పార్టీలో చేరారు. మా తర్వాత కూడా పార్టీకి ఎంతో అద్భుతమైన సేవలు అందించారు. ఆయన ఎంతో నీతి, నిజాయతీ ఉన్నవారు. ఆయనను గౌరవించాల్సిన అవసరం ఉంది’ అని పట్నాయక్ వివరించారు. ఇటీవల జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ ప్రభుత్వం ఘోర పరాజయం చవిచూసింది. దీంతో 24 ఏళ్లపాటు సుదీర్ఘంగా సీఎంగా పనిచేసిన నవీన్ పట్నాయక్ గద్దె దిగాల్సి వచ్చింది.






