దొంగ ‘మన్ను’షులు!
- అక్రమంగా మట్టిదందా
మాముళ్ల మత్తులో అధికారులు
రైతుల పేరిట అనుమతులు
రియల్ ఎస్టేట్లకు అమ్మకాలు
పాతపాల్వంచ చింతలచెరువు మట్టి పక్కదారి
తెలుసుకొని నిలిపివేశాం : ఈఈ అర్జున్
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 1౯ (విజయక్రాంతి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వం చ పట్టణ పరిధిలోని పాతపాల్వంచ చింతలచెరువు అభివృద్ధి పనుల్లో అధికారిక మట్టి దందా యధేచ్చగా సాగుతోంది. రైతుల పేరు తో దరఖాస్తు చేసి రియల్ వ్యాపారుల భూముల్లో, సాగుచేయని భూముల్లో వందల సంఖ్య లో లారీల మట్టిని రెయింబవళ్లు మట్టిదందా చేస్తున్నా అధికారులు మామూళ్ల మత్తులో తూలుతూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు సర్వత్రా విన్పిస్తున్నాయి. పెద్ద పెద్ద ప్రొక్లెయిన్లు, టిప్పర్లతో చేరువును విచ్చలవిడిగా తవ్వుతున్నా నీటి పారుదలశాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
ఫలితంగా చెరువు మట్టి దళారులకు కాసుల వర్షం కురిపిస్తోందనడంలో సందేహం లేదు. దీంతో రైతుల పొలాలకు పదుల సంఖ్యలో లారీల మట్టి తోలితే పొలాల కాని స్థలాలకు వందల సంఖ్యలో లారీల మట్టి తోలకాలు జరుగుతున్నాయి. జిల్లా కార్యాలయానికి కూత వేటు దూరంలో ఇంత దందా జరుగుతున్నా రెవెన్యూ అధికారులకు చీమ కుట్టినట్లునా లేదు. దీంతో తిలా పాపం తలా కొద్దిగా అన్న చందాన రెవె న్యూ, నీటిపారుదల, పోలీస్ శాఖ అధికారులు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఫలితంగా చెరువు మట్టి పెద్ద ఎత్తున పక్కదారి పడుతోంది.
అభివృద్ధిమాటున అక్రమం
చింతల చెరువునుప్రత్యేక అభివృద్ధి నిదులు రూ.10కోట్లతో మినీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేయాలని చేపట్టిన అభివృద్ది పనుల మాటున మట్టిదందా విచ్చలవిడిగా సాగుతోంది. చెరువులోని పూడికమట్టిని రైతులకు ఉచితంగా పంపిణీ చేయాల్సి ఉంది. కేవలం పోలాలకు మాత్రమే మట్టిని ఉచితంగా తోలుకోవడానికి అనుమతి ఉంటే కొంతమంది దళారులు జేసీబీ, పొక్లెయిన్‌లు యజమానులు అధికారులతో కుమ్మక్కై నిబంధనలను తుంగలో తొక్కి మట్టిదందాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఫలితంగా మట్టి వ్యాపారం గత పది రోజులుగా జోరుగా సాగుతోంది. పొలాల మాటున రియల్‌ఎస్టేట్ భూములకు భారీగా మట్టిని తరలిస్తు న్నారు. అందుకు చెరువు ఆనుకొని ఉన్న వ్యవసాయం చేయని భూముల్లో పెద్ద ఎత్తున మట్టి తోలుతున్నా పట్టించుకోక పోవడం ఆరోపణలను ధృవపరుస్తోంది.
3 జెసీబీలు పదుల సంఖ్యలో భారీ లారీలతో మట్టి తోలకాలు ముమ్మరంగా సాగుతోంది. ఒక్కో టిప్పర్‌కు దూరాన్ని బట్టి రూ 1750 నుంచి రూ 2,500 వరకు తీసుకొంటున్నట్లు తెలుస్తోంది. అంత పైకం అనే సరికి రైతులు వెనుకంజ వేస్తున్నారు. వాస్తవంగా మట్టి అవసరమైన రైతులు తమ పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్‌కార్డుతో నీటిపారుదల శాఖ అధికారికి దరఖాస్తు చేస్తారు.దరఖాస్తు ఆధారంగా నీటిపారుదలశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవంగా పొలంలోకే మట్టి అవసరమని భావిస్తే అందుకు అనుమతిస్తారు. అప్పుడు రైతు జేసీబీ, ట్రాక్టర్, లారీలను స్వంత ఖర్చుతో మట్టిని తోలుకోవాలి, మట్టి ఉచితంగా ఇచ్చినా ట్రాక్టర్, లారీ, జేసీబీ ఖర్చును రైతు భరించాలి.
ఎక్కడైనా పొలాలకు కాకుండా వ్యవసాయం చేయని భూములకు, రియల్ వ్యాపారుల భూములకు మట్టి తోలకాలు జరిగితే దరఖాస్తు దారునితో పాటు, మట్టి తోలిన జేసీబీ యజమానిపై కూడా క్రిమిలన్ కేసు నమోదు చేయాలని చట్టం చెబుతున్నా చింతల చెరువు నుంచి మాత్రం మట్టి 90శాతం వ్యవసాయం చేయిన భూములకు, త్వరలో వెంచర్లు వేసే భూములకు తోలకాలు జరుగుతున్నాయి. ఈ విషయమై నీటిపారుదల శాఖ ఈఈ అర్జున్‌ను వివరణ కోరితే చెరువు మట్టిని కేవలం రైతులు పొలాలకు మాత్రమే తోలుకోవాలని, అదికూడా ఉచితంగా ఇస్తామని, తోలడం వారి ఖర్చుతో చేయాల్సి ఉందన్నారు.
చెరువు కట్ట కింది భాగంలో రియల్ వ్యాపారుల భూమిలో, మామిడి తోటల్లో , ఇళ్లమధ్య బేసిమట్టం కటవ్టిన ప్రదేశాల్లో మట్టి తోలారు కదా అని ప్రశ్నిస్తే పొలాలకని చెప్పి తోలారని, తీరా చూస్తే అవి పొలాలకు కావని తెలియడంతో నిలిపివేశామన్నారు. అధికారుల దృష్టికి మట్టి అక్రమాల విషయం తీసుకెళ్లినా మట్టి దందా అలాగే సాగడం కొసమెరుపు.






