సీఎం రేవంత్‌రెడ్డిని అరెస్టు చేసే కుట్ర
పీసీసీ ఉపాధ్యక్షుడు, భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, మే2 (విజయక్రాంతి): ఢిల్లీ పోలీసులను అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని అరెస్టు చేయాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ పీసీసీ ఉపాధ్యక్షులు, భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. గత పదేళ్లుగా బీజేపీ సోషల్ మీడియా ద్వారా ఇతర పార్టీలను, భారతదేశ చరిత్రనే మార్చే విధంగా వీడియోలు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తోందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేయాలని బీజేపీ అత్యుత్సాహం ప్రదర్శిస్తుందని ఆయన మండిపడ్డారు. ఢిల్లీ పోలీసులను అడ్డం పెట్టుకుని వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులను అరెస్టు చేసినట్లు రేవంత్‌రెడ్డిని అరెస్టు చేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులను భయబ్రాంతులకు గురి చేయాలని చూస్తోందని ఆరోపించారు.
బీజేపీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలపై గతంలో ఎన్నో పోరాటాలు చేసి రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్లారని, ఇప్పుడు ఎంత భయపెట్టినా భయపడే పరిస్థితి లేదన్నారు. తెలంగాణలో బీజేపీ చేయించిన సర్వేలలో ఒక్క సీటు కూడా రాదనేది తెలిసి కుట్రలకు పాల్పడుతోందన్నారు. సీఎంగా, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి వీడియోను మార్ఫింగ్ చేయాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. బీజేపీకి 400 సీట్లు వస్తే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని, చేర్పులు చేసి రిజర్వేషన్లు తీస్తుందని విమర్శించారు.




