రాష్ట్రంలో నిప్పుల వాన
22 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం
ఈశాన్య రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు
హైదరాబాద్, మే 2(విజయక్రాంతి) ః రోహిణి కార్తిలో (మే) రోళ్ళు కూడా పగిలిపోతాయనే నానుడిని నిజం చేస్తూ రాష్ట్రంలో మే నెల మొదటి రెండు రోజుల్లోనే భానుడు తన ఉగ్రరూపం దాల్చుతూ నిప్పుల వాన కురిపిస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లాల్లో 46 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన 13 జిల్లాల్లో 43 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కావడం విశేషం. ఏప్రిల్ చివరి వారం వరకు 41 నుంచి 42 మధ్య ఉన్న ఉష్ణోగ్రత ఒక్క సారిగా మూడు డిగ్రీలు పెరిగింది. కాగా, గతంలో ఎన్నడూ లేనంతగా 48 నుంచి 49 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరించారు.
దీన్ని నిజం చేస్తూ గురువారం నల్లగొండ జిల్లాలోని ఇబ్రహీంపట్నం 46.6, మాడ్గులపల్లి 46.2, నాంపల్లి 46.4, కేతిపల్లి 46.2, తెర్లదేవర పల్లె 46.2 కట్టంగూర్ 46, త్రిపురారం 46, నల్లగొండ ఎస్‌ఈ కార్యాలయం 46, పులిచెర్ల 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, సూర్యాపేట జిల్లాలోని మునగాల 46.4, పెదవీడులో 46.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అదే విధంగా కరీంనగర్ జిల్లాలోని నేరెల్లలో 46.4, జగిత్యాలలోని వెలగూటూరు 46.4, మంచిర్యాలోని జన్నారం 46.3, పెద్దపల్లిలోని సుల్తానాబాద్ 46.2, వీణవంక 46, నాగర్ కర్నూల్‌లోని కిస్టింపల్లేలో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
గ్రేటర్ హైదరాబాద్‌లో ఎండ తీవ్రత
గ్రేటర్ హైదరాబాద్‌లో అత్యధికంగా కుత్బుల్లాపూర్‌లో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, అత్యల్పంగా 24 డిగ్రీలు నమోదు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే మూడు రోజులు అత్యధికంగా 41 నుంచి 43 డిగ్రీలు, అత్యల్పంగా 28 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మూడు రోజులు వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపింది.
మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు
మే నెలలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరించింది. రాబోయే 11 రోజుల పాటు వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే 2024లో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నయోదయ్యాయని తెలిపింది.
ఈశాన్య రాష్ట్రాల్లో వర్ష సూచన
తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతుండగా ఈశాన్య రాష్ట్రాల్లో వర్ష సూచన కనిపిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, సిక్కిం, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.




