వృద్ధురాలిని ఎత్తుకొని వెళ్లి..
ఓటు వేయడానికి సాయపడ్డ కానిస్టేబుల్..
కోటపల్లి (విజయక్రాంతి): వయసు మీద పడ్డ వృద్ధురాలు తన అమూల్యమైన ఓటును సద్వినియోగం చేసుకోవడానికి పోలింగ్ కేంద్రానికి రాగా ఓటు వేయడానికి సాయం అందించిన పోలీస్ కానిస్టేబుల్ ను అందరు అభినందించారు. బుధవారం మూడవ విడత ఎన్నికలు మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో జరుగుతున్నాయి. కోటపల్లి మండలం సిర్సా గ్రామంలో ఓ వృద్ధురాలు తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి కుటుంబ సభ్యుల సాయంతో పోలింగ్ కేంద్రానికి రాగా నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలి సమస్యను గమనించిన స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ నితీన్ వెంటనే స్పందించారు. ఆ వృద్ధురాలిని తన చేతులతో ఎత్తుకొని లోపలికి తీసుకెళ్లారు. వృద్ధురాలికి ఓటు వేసేలా సహకారం అందించి తన సేవాభావాన్ని చాటుకున్నారు. వృద్ధురాలికి సహాయమందించిన కానిస్టేబుల్ ను గ్రామస్థులు అభినందించారు.






